ఎగ్జిట్ పోల్స్ ముందుగా వెల్లడించిన అంచనాలకు మించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికావడం మోడీ నితీశ్ జోడీ దోస్తీ విజయం సాధించడం బీహార్ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయం. రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవకాశాలను చేజిక్కించుకోవడంలో అపర చాణక్యుడుగా ప్రఖ్యాతి వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి, జెడి (యు) అధినేత నితీశ్ కుమార్ ఇమేజ్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏమాత్రం పనిచేయలేదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. విపక్ష కూటమి మహాగట్‌బంధన్ ఎంత ప్రయత్నించినా ఓట్లను రాబట్టుకోలేకపోయింది. మహాగట్ బంధన్‌లో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో ఓటర్ల జాబితాల్లోని అనేక అవకతవకలు ఎత్తిచూపినా, ఓట్లచోరీ నినాదంతో పోరాటం సాగించినా అవేవీ ఓటర్లకు పట్టలేదనిపిస్తోంది. ఓటర్ల తుది జాబితాలో చోటు లేని 47 లక్షల ఓటర్లలో 16 లక్షల మంది మహిళా ఓటర్లే ఉండగా, ఈసారి పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లలో మహిళలే అత్యధిక శాతం ఉండడం గమనార్హం.
మహిళా ఓట్లపైనే నితీశ్ గురిపెట్టి పథకాల మంత్రాల గారడీ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే రాష్ట్రం లోని 21 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఈ విధంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం అందించగలిగారు. ఈ పథకాల మంత్రంలో మోడీ వ్యూహాల తంత్రం కూడా ఉంది. ఈ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని గత సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యూహమే. రాష్ట్రంలో 50 శాతం కంటే మహిళా ఓటర్లు ఉన్న జిల్లాలు 25 ఉండగా, ఇక్కడి 174 సీట్లలో జయాపజయాలను నిర్ణయించేది మహిళలే. 2010 నుంచి బీహార్‌లో మహిళా ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఈ ఓట్లే నితీశ్‌కు విజయావకాశాలను కల్పించాయి. 2005లో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నితీశ్ మహిళా ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు.
బీహార్‌ను అత్యధికంగా వేధిస్తున్న నిరుద్యోగ సమస్యపై ఈసారి పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించి హామీలు గుప్పించాయి. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం ఉండగా, బీహార్‌లో సరాసరి నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. ఇప్పటి వరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయకపోయినా, నితీశ్ ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగులకు వివిధ రంగాల్లో లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల మంది 18 నుంచి 23 ఏళ్ల లోపు వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటినా వారు. వీరి ఓట్లు జయాపజయాలను నిర్ణయిస్తాయని భావించి పార్టీలన్నీ హామీలు ప్రకటించాయి. మహాగట్‌బంధన్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. బీహార్‌లో 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల ప్రకారం 2.97 ఉద్యోగాలు కల్పించడం సాధ్యమా అన్న ప్రశ్న ఎదురైంది.
నిరుద్యోగుల ప్రభావం పోలింగ్‌లో ఎంతవరకు పనిచేసిందో చెప్పలేం. ఎన్‌డిఎ కూటమి కూడా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఉపాధి కల్పన కోసం బడ్జెట్ నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. ఇక కులాల ప్రభావాన్ని పరిశీలిస్తే 2023లో నితీశ్ కుమార్ నిర్వహించిన కులాల గణన బట్టి బీహార్‌లో కులమే ప్రధాన బలమైన పునాదిగా వెల్లడవుతోంది. ఈ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ ముస్లిం యాదవ్ వర్గాలను సమీకరించడం పైనే దృష్టి కేంద్రీకరించగా, ఎన్‌డిఎ కూటమి మహిళా ఇబిసి వ్యూహాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. బిజెపి అగ్రవర్ణాల ఓట్లను గుత్తగోలుగా కొల్లగొట్టడానికి నిర్విరామం గా కృషి చేసింది. నితీశ్ మాత్రం కుర్మీ ఓట్ల ఆర్జన పైనే దృష్టి పెట్టారు. జెడి(యు) ఎంఎల్‌ఎల్లో ఏడుగురు కుర్మీలు, నలుగురు యాదవులతో కలుపుకుని స్థానిక ప్రాధాన్యం కలిగిన ఒబిసి గ్రూపులకు చెందినవారే ఉన్నారు. ఎన్‌డిఎ కూటమిలో భాగస్వాములైన లోక్‌మోర్చా, ఎల్‌జెపి, హిందుస్థాన్ అవామీ లీగ్ (ఎస్) పార్టీలు దళిత ఓటర్లను ఆకర్షించడానికి సమయం వెచ్చించాయి.
2024 లో కేంద్రంలో ఎన్‌డిఎ అధికార పగ్గాలు అందుకోవడానికి జెడి(యు) పొత్తు ఎంతో కీలక పాత్ర వహించింది. అందుకని కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగడంలో బీహార్ మద్దతు చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మఖానా బోర్డు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్‌టెక్నాలజీ ఏర్పాటు, ఐఐటిల విస్తరణ, కొత్తగా ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం దాదాపు 200కు పైగా ఎంపి సీట్లు ఉన్న హిందీ హార్ట్ ల్యాండ్‌లో 40 ఎంపి సీట్లు బీహార్‌లోనే ఉండడం విశేషం. హిందీ హార్ట్‌ల్యాండ్ పరిధిలో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క జార్ఖండ్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఎన్‌డిఎ కూటమి పాలనలోనే మనుగడ సాగిస్తున్నాయి. కేంద్రం లోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి గుండెకాయ లాంటి ఈ హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు తారుమారైనా అది కేంద్ర ప్రభుత్వ సుస్థిరతపై తీవ్ర ప్రభావం చూపించక తప్పదు. అందుకని బీహార్ రాష్ట్రంలో ఎన్‌డిఏ కూటమి విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రధాని మోడీ, అమిత్ షా తదితర బిజెపి అగ్రనేతలు నిర్విరామంగా ప్రచారం సాగించి దక్కించుకోగలిగారు.