దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన ‘కాంత’ శుక్ర వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ : అయ్య (సముద్రఖని) ఓ సినిమా డైరెక్టర్. అనాథ అయిన మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు. దీంతో, తనకు తాను గొప్ప స్టార్ ను అయ్యాను అనే అహంకారం వస్తుంది. దీనికి తోడు కథ కంటే కూడా.. అభిమానులు తనకు కొట్టే చప్పట్లే తనకు ఎక్కువ అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అయ్య (సముద్రఖని) ఇష్టపడి రాసుకున్న శాంత కథతో సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. ఇద్దరి మధ్య విభేధాల కారణంగా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత సినిమా, కాంత సినిమాగా మళ్ళీ మొదలవుతుంది. ఈ సారి కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్‌గా నటిస్తుంది. మరి ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, చివరకు కుమారి కథ ఏమైంది?, రానా పాత్ర ఏమిటి?, అసలు కాంత సినిమా బయటకు వచ్చిందా? లేదా? అనేది మిగిలిన కథ.
కథనం, విశ్లేషణ: సినిమా ఎంతమేరకు ప్రే క్షకులకు వినోదాన్నిచ్చిందన్నదే బాక్సాఫీస్ ఫలితానికి గీటురాయి. ‘కాంత’ ఈ విషయంలో నిరాశకే గురి చేస్తుంది. ఇది జనరంజకమైన సినిమా కాదు. కొత్త కాన్సెప్టుతో దర్శకుడు సెల్వమణి వెరైటీ సినిమానే తీశాడు. కానీ.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే కథనం లేకపోవడం వల్ల ‘కాంత’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దుల్కర్ సల్మాన్ తన నటనతో మెప్పించాడు. మిగతా ప్రధాన నటులు తమ నటనతో పర్వాలేదనిపించారు. మొత్తానికి ‘కాంత’ ప్రేక్షకులను అలరించలేకపోయింది.