వాషింగ్టన్ : విధించిన టారీఫ్‌లపై జనం నుంచి తీవ్ర స్థాయి నిరసన వ్యక్తం కావడంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనకకు తగ్గారు. వెంటనే బీఫ్, కాఫీ, పండ్లపై విధించిన సుంకాలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నిత్యావసర సరుకులపై సుంకాలతో వినియోగదారులపై ధరల భారం పడుతూ ఉండటంతో, తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అయింది. దీనితో ట్రంప్ దూకుడుకు బ్రేక్ వేసుకోవల్సి వచ్చింది. ఇటీవలి పలు ఎన్నికలలో ఆర్థిక అంశాలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. వర్జీనియా, న్యూజెర్సీ ఇతర ప్రాంతాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. అయితే టారీఫ్‌లతో ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడదని ట్రంప్ అధికార యంత్రాంగం చెపుతూ వచ్చింది.
కానీ పౌరులకు దైనందిన అవసరాలలో కీలఅం అయిన బీఫ్, కాఫీల ధరలపై టారీఫ్‌ల ప్రభావం పడుతూ వచ్చింది. బ్రెజిల్ ఇతర దేశాల నుంచి అమెరికాకు ఎక్కువగా బీఫ్, ఇతరత్రా సీజనల్ పండ్లు కూరగాయలు వస్తుంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చే మామిడి పండ్లు, ఆపిల్స్ వంటివి అమెరికన్లు ఎక్కువగా తీసుకుంటారు. అయితే తన సార్వత్రిక టారీఫ్ విధానంలో భాగంగా ట్రంప్ ఆయా దేశాలపై భారీ సుంకాల విధింపుతో ఈ పండ్లు కూరగాయలపై కూడా పన్నుల భారం పడింది. దీనితో అమెరికా మాల్స్ , మార్కెట్‌కు ఈ సరుకు తగ్గిపోవడం, లేదా ఎక్కువ ధరలకు కొనుక్కోవల్సి రావడంతో జనం ఆందోళనకు గురి అయ్యారు. దీనితో ఈ టారీఫ్‌లను వెనకకు తీసుకోవల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.