పాట్నా: టైగర్ అభీ జిందా హై.. అన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ టైటిల్ గుర్తు ఉందా!.. జేడి(యు) నాయకుడు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను చూస్తే.. అదే గుర్తుకు వస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా అలుపు ఎరుగని వీరుడు నితీశ్ జీ. ఆయన అలసిపోలేదు. పదవీ విరమణ చేసే మూడ్ లో కూడా లేదని ఎవరికైనా అన్పిస్తుంది. ఎందుకంటే, ఆయన పార్టీ 2020 బీ హార్ అసెంబ్లీలో సాధించిన సంఖ్యను దాదాపు రెట్టింపు సాధిస్తున్నది. మళ్లీ తాజాగా ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీహార్ ముఖ్యమం త్రి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఆరోగ్యం పై వచ్చిన పుకార్లు వొట్టివేనని రుజువు చేశారు. అలాగే అలసట కారణంగా ఇబ్బంది పడుతున్నారన్న వార్తలు తప్పుడు వేనని నిరూపించారు. 75 ఏళ్ల వయస్సులోనూ నితీశ్ కుమార్ ఎంతో చురుగ్గా ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన జీవిక, ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలకు సామాజిక భద్రతా పెన్షన్లు, స్టైఫెండ్ లు పెంచడంతో పాటు పలు ప్రయోజనాలను దూకుడుగా అందించారు. అంతేకాక ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద కోటి మందికి పైగా మహిళలకు బ్యాంక్ ఖాతాలలో ఒకొక్కరికీ రూ. 10,000 అందించారు.
నితీశ్ కుమార్ ప్రత్యర్థులు ఈ ఉచితాల పథకాల ప్రభావం పట్ల ఆందోళన చెందాయి. నితీశ్ కుమార్ ఇతరులను అనుసరించే, కాపీ మాస్టర్ అని తేజశ్వీ యాదవ్ ఆరోపించారు. ఓటర్లకు లంచం ఇస్తున్న నితీశ్ ను ఎన్నికల కమిషన్ గమనించాలని ప్రశాంత్ కిశోర్ అనుచరుడు పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు కూడా. బీహార్ లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితిశ్ కుమార్, ఎన్నికల తర్వాత తనను అవమానకరంగా పంపివేస్తుందని వచ్చిన ఆరోపణలను కూడా ఎన్నడూ పట్టించుకోలేదు. భయపడలేదు. లోక్ సభలో మెజారిటీ లేని బీజేపీ కేంద్రంలో అధికారంలో మనుగడ సాధించాలంటే జేడి(యు) పై ఆధారపడి ఉన్నదన్న వాస్తవం ఓ కారణం కావచ్చు. 1951లో బీహార్ లోని భక్తియార్ పూర్ లో జన్మించిన నితిశ్ కుమార్ లోక్ నాయక్ జయప్రకాశ్ ఉద్యమ సమయంలో రాజకీయ అరంగేట్రం చేశారు. జనతా పార్టీలో చేరి 1977లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయారు. 1985లో ఆయన ఎన్నికల్లో తొలివిజయం సాధించారు. అయితే ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన తరచు పార్టీలు మారడంతో ఆయనకు పాల్తు రామ్ మారుపేరు వచ్చింది. అందువల్లనే కుమార్ ఎప్పుడు ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్ష శిబిరంవైపు మొగ్గుచూపుతారేమోనని బీజేపీ ఎప్పుడు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటుంది. అయితే నితిశ్ ఈసారి అలాంటి చర్యలకు పూనుకోలేదు. ఆ ప్రతిపక్షాలకు తగిన సంఖ్యా బలం లేదు. చాలా కాలంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు ఎన్నికలు జరిగినప్పుడు జెడి(యు) అధినేత అభ్యర్థిత్వం పై చర్చ జరగడం ఊహాగానాలు హల్ చల్ చేయడం తెలిసిందే.