మెదక్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూశానైనా బిఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించటం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎక్కడ చూసిన కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అయిన సరే కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు. అనుకున్న స్థాయిలో ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పనిచేయకపోవడంతో జాగృతి సంస్థ ప్రశ్నించే శక్తిగా ప్రజల వజ్రాయుధంగా మారుతుందన్నారు. మెదక్ జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా కవిత మాట్లాడారు. సోషల్ మీడియాలోనే వాళ్లు యుద్ధం చేస్తున్నారు కానీ ప్రజల్లోకి రావటం లేదన్నారు. కృష్ణార్జునులు అనుకునే వాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చరుచుకుంటున్నారని, కానీ పెద్ద ఎత్తున ప్రజల కోసం వారి సమస్యల కోసం పనిచేయటం లేదని చురకలంటించారు.
జూబ్లీహిల్స్ లో విత్ డ్రా చేసుకోవాలని కొంతమంది తన దగ్గరి వచ్చారని, తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని అడిగారని, తాను బిఆర్ఎస్ లో లేనని చెప్పానన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మరణించినా కూడా పార్టీ కోసం టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ పనిచేశారని ఆయన భజనపరులు మోశారని, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓడిపోవటంతో హరీష్ రావు ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు లేకపోతే మాజీ సిఎం కెసిఆర్ లేరని, తెలంగాణ ఉద్యమమే లేదన్నట్లుగా ప్రచారం చేస్తారని కవిత ధ్వజమెత్తారు.
హరీషన్న పార్టీలో ఉండి పార్టీని మోసం చేయటం మానుకోవాలని, హరీష్ అవినీతి బయటపెట్టిన సరే ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అడిగారు. హరీష్ రావుకు ముఖ్యమంత్రికి ఏం అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలని నిలదీశారు. మెదక్ జిల్లా అంటే నెక్ట్స్ న్యూయార్క్ అనుకున్నామని, ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, మహానాయకులు ఉన్న చోట ఇలాగే ఉంటుందని ఇప్పుడే జ్ఞానోదయం అయ్యిందన్నారు. కెసిఆర్ కళ్లకు గంతలు కట్టి బిఆర్ఎస్ ను అధోగతి పాలు చేస్తున్నారని కవిత దుయ్యబట్టారు. ఈ అరాచకాలు కెసిఆర్ కు తెలిసి ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వారు కాదు అని, రామన్న సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ లు ఉన్నాయని, కెసిఆర్ ప్రభుత్వంలో మెదక్ కు రూ. 50 కోట్లు, మిగతా వాటికి రూ. 25 కోట్లు కేటాయించారని, ఆ నిధులు వచ్చాయో లేదో తనకు తెలియదన్నారు. కానీ రామాయం పేట మాత్రం వర్షాలకు మునిగిపోయిందని, అక్కడి ప్రజలను పలకరిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, కొత్తగా అయినా మండలాలు, రెవెన్యూ డివిజన్లకు ఆఫీస్ లేవని దుయ్యబట్టారు. కొత్తగా జిల్లా అయి 12 ఏళ్లు అయినప్పటికీ ఎందుకు ఫలితం దక్కలేదని ప్రశ్నించారు.