న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. శుక్రవారం ఈ సంఘటనతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ముగ్గురు డాక్టర్లను, ఎంబిబిస్ విద్యార్థిని అరెస్టు చేయడమే కాక, ఇద్దరు ఎరువుల వ్యాపారులను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన డాక్టర్లకు ఆశ్రయంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిడీకి చెందిన మరో ఇద్దరు డాక్టర్లు మొహమ్మద్, ముస్తాకిమ్‌లను నుహ్ నుంచి అదుపు లోకి తీసుకున్నారు. పేలుడుకు ఉపయోగించిన కారును నడిపిన డ్రైవర్ డాక్టర్ ఉమర్ నబీకి వీరిద్దరూ సన్నిహితులని అధికారులు శనివారం వెల్లడించారు. వీరు కాక ఇదివరకు అల్ ఫలాహ్ యూనివర్శిటీలోను తరువాత పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేసిన 45 ఏళ్ల సర్జన్‌ను పఠాన్‌కోట్ నుంచి అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమబెంగాల్ ఉత్తర్‌డినాజ్‌పూర్ నుంచి ఎంబిబిఎస్ విద్యార్థిని ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. లూథియానాకు చెందిన జైసూర్ అలం, అలియాస్ నిసార్ అలం అనే ఈ విద్యార్థి హర్యానాలోని అల్‌ఫలాహ్ యూనివర్శిటీలో ఎంబిబిఎస్ చదువుకున్నాడు. శుక్రవారం ఉదయం సూరజ్‌పూర్ బజార్ ఏరియా నుంచి అదుపు లోకి తీసుకున్నారు. ఇదే కేసులో టీ అమ్మే వ్యాపారిని వజిర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అదుపు లోకి తీసుకుని ప్రశ్నించారు. పేలుడు జరిగిన రోజు డాక్టర్ ఉమర్ నబీ ఈ టీ వ్యాపారి స్టాల్ వద్ద పది, పదిహేను నిమిషాల పాటు కారును ఆపినట్టు ఆ తరువాత అక్కడ మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసినట్టు తెలిసింది. ఉమర్ ఏదీ తినడం కానీ తాగడం కానీ చేయలేదని, వెళ్లే ముందు కొంతసేపు అక్కడ కూర్చున్నాడని టీ వ్యాపారి పోలీసులకు చెప్పాడు. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్‌నబీ గురించి తనను వివరాలు అడగ్గా, ఎందరో కస్టమర్లు తనవద్దకు వస్తుంటారని, అందువల్ల ఒక కస్టమరుగా అతని గురించి ప్రత్యేకంగా తానేమీ గమనించలేదని టీ వ్యాపారి పోలీసులకు వివరించాడు. అయితే మాస్క్‌ధరించి ఉన్నట్టు గుర్తించానని టీ వ్యాపారి పేర్కొన్నాడు. విచారణ తరువాత టీ వ్యాపారిని పోలీసులు విడిచిపెట్టేశారు. సమీపాన రామ్‌లీలా మైదాన్‌లో ఉన్న మసీదు నిర్వాహకులను కూడా పోలీసులు వివరాలు అడిగారు. ఆరోజు మసీదును ఎవరెవరు సందర్శించారో రికార్డులను పరిశీలించారు.
ఈలోగా నుహ్‌లో లైసెన్సు లేకుండా ఎరువులు, అమ్ముతున్న డినేష్ అలియాస్ డబ్బును, మరో వ్యాపారిని దర్యాప్తు సంస్థలు అదుపు లోకి తీసుకున్నారు. టెర్రర్ మాడ్యూల్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి సేకరించిన రూ.26 లక్షల్లో రూ.3 లక్షలు బాంబుల తయారీకి ఉపయోగించే ఎన్‌పికె ఎరువులు కొనుగోలుకు ఖర్చు చేసినట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో డినేష్ నిందితులకు ఎరువులు అమ్మాడా అన్న అనుమానంతో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ అరెస్టులన్నీ శుక్రవారం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాల సమన్వయంతో హర్యానా లోని ధౌజ్, నుహ్ ప్రాంతాల్లో జరిగాయి. డాక్టర్లు మొహమ్మద్, ముస్తాకిమ్‌లు ఇదివరకే అరెస్టయిన డాక్టర్ ముజమ్మిల్‌గనైతో సన్నిహితంగా ఉండేవారని ,అలాగే డాక్టర్ ఉమర్‌నబీకి అత్యంత మిత్రులని దర్యాప్తులో బయటపడింది.
అరెస్టయిన ఈ డాక్టర్లలో ఒకరు పేలుడు జరిగిన రోజున ఎయిమ్స్‌లో ఇంటర్వూలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. డాక్టర్ ముజమ్మిల్‌గనైతో సన్నిహితంగా ఉన్నందున పేలుడు సంఘటనలో వీరి ప్రమేయం ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎర్రకోట వద్ద పేలుడు జరిగినప్పుడు సమీపాన అనేక డజన్ల కార్లు పార్కింగ్ చేసి ఉన్నట్టు దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. ఆ కార్ల డ్రైవర్లను , యజమానులను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కారు పేలుడు జరిగిన మూడుగంటల్లో అక్కడ సమీపాన గల సునేహ్రి మసీదు పార్కింగ్ ఏరియాలోకి ఏయే సమయాల్లో ఎన్ని కార్లు వచ్చి వెళ్లాయో వాటి నెంబర్లు, రిజిస్ట్రేషన్ వివరాలు, సేకరిస్తున్నారు.