జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఓ వ్యూహాత్మక మార్పు కు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కన్పించని ఓ పాజిటివ్ మార్పుకు ఈ ఎన్నిక వేదిక అయింది. జాతీయ పార్టీ కావడంతో సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అంతగా ఉండదు. ఎవరికివారే గొప్ప లీడర్లుగా చెలామణి అయ్యారు. నాయకత్వానికి కిందిస్థాయి నుంచి ఏకరీతిలో ఎప్పుడూ సహకారం అందదు. గతంలో ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నాయకత్వానికి అన్ని వర్గాల నుంచి బాసట లభించింది. అంతకు ముందు ఏ నేత కూడా పట్టుమని పది ఇరవై నెలలకు మించి ముఖ్య పదవిలో ఉండలేకపోయేవారు. ఈ సంస్కృతికి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెక్‌పెట్టారు. తనదైన శైలిలో రాజకీయాలు నడిపి.. ఇటు ప్రజల మద్దతు.. అటు అధిష్టానం మద్దతు.. మధ్యలో స్థానిక అగ్రనేతల మద్దతు కూడగట్టి ఆయన లీడర్‌గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత.. ఇన్ని రోజులకు మళ్లీ కాంగ్రెస్‌లో ఓ ఐక్యతా స్ఫూర్తి కన్పించింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంత ప్రాధాన్యమైనది ఏమీ కాదు.కానీ సిఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన రెండేళ్ల పాలనను పరీక్షించుకున్నారు. బిఆర్‌ఎస్ దూకుడుకు కల్లెం వేయాలని భావించారు.
అందుకు ఆయనకు పార్టీ నేతలంతా పూర్తిగా సహకరించడం ఇక్కడ కీలక అంశంగా చెప్పొచ్చు. రేవంత్ కంటే సీనియర్లు అయిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి అగ్రనేతలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌లోని ఇగో సంస్కృతికి ఇది విరుద్ధం. అదృష్టం కలిసొస్తే మేమే ముఖ్యమంత్రి అయ్యే వాళ్లం అనుకునే నేతలు భట్టి, ఉత్తమ్. కానీ వారు తమ ఇగోలను.. సీనియర్ అనే భేషజాలను పక్కనపెట్టారు. ‘జూబ్లీహిల్స్‌లో గెలిస్తే రేవంత్‌కు క్రెడిట్ దక్కుతుంది.. మాకేం వస్తుంది’ అనుకోకుండా భట్టి, ఉత్తమ్, పొన్నం, పొంగులేటి, తుమ్మల, సీతక్క వంటి అగ్రనేతలు, పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్‌లో అన్ని డివిజన్లలో కలియతిరిగి నవీన్ యాదవ్ గెలుపుకోసం విస్తృత కృషి చేశారు. ఇది కాంగ్రెస్ గత సంస్కృతికి విరుద్ధమే. గతంలో ఎన్నడూ ఇలా కాంగ్రెస్ అగ్రనేతలు ఏకం కాలేదు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌లో గొప్ప పరిణామమే అని చెప్పొచ్చు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అయినా.. ఆ క్రెడిట్‌ను అడ్డం పెట్టుకుని ప్రజల మనసులు గెలవలేకపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు.
ఈ క్రమంలో అప్పట్లో టిపిసిసి నేతగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాలా అపవాదులు మూటగట్టుకున్నారు. ఆయన నాయకత్వంపై అంతటా అసంతృప్తి వ్యక్తమైంది.ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని తేల్చారు. అందుకు తగ్గట్టు పాపం ఆయన టిపిసిసి పదవిని త్యాగం చేశారు కూడా. అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌లో పూర్తి స్తబ్ధత నెలకొంది. వ్యూహాలను మార్చినా రెండోసారీ కెసిఆర్ సిఎం కావడంతో ఇక మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం మార్చింది. తన వాగ్ధాటి, ఆర్థిక, అంగబలం, ప్రజాకర్షక శక్తితో అకస్మాత్తుగా తెరపైకివచ్చి.. కెసిఆర్ ను తీవ్రంగా విమర్శించి టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిన ఎనుముల రేవంత్‌రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో మళ్లీ కదలిక వచ్చింది. కెసిఆర్‌ను ఎదుర్కొనేశక్తి రేవంత్‌రెడ్డికి ఉందని భావించడంతో ఆయనకు అప్పటి వరకు సీనియర్లుగా ఉన్న నేతలు సైతం మద్దతు తెల్పక తప్పలేదు.
ముఖ్యంగా అధిష్టానం నిర్ణయం కాబట్టి అందరూ ఆమోదించారు. ఈక్రమంలో రేవంత్‌రెడ్డి అనూహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం.. సీఎం పీఠం అధిష్టించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో సీనియర్లు అందరికీ మంచి పదవులే దక్కాయి. కెసిఆర్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలంతా.. రేవంత్ సిఎం అయ్యాక మంచి పదవులు మూటగట్టుకుని మళ్లీ రాజకీయంగా ప్రజా జీవితం చవిచూశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవించారు. మనలో మనం పోట్లాడుకుంటే ఈ పదవులుకూడా దక్కేవి కావేమో అనుకుంటూ ఓ రాజకీయ మార్పుకు నాంది పలికారు. అందరూ ఏకమై.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోప్రత్యర్థి గెలుపును శాసించారు. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదీ కాదు.. అందరి సమష్టి శ్రమ అని చాటి చెప్పారు. ఇదే మార్పు మరో రెండున్న ఏళ్ల వరకూ కొనసాగితే.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
-ఎన్. మల్లేష్‌బాబు
– 70133 59750