మన తెలంగాణ/హైదరాబాద్: ‘జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికలో గెలువబోతున్నాం, రాసిపెట్టుకోండి. ఇక్కడ మరో విశేషం ఏ మిజరుగబోతుందంటే, బీజేపీకి డిపాజి ట్ గ ల్లంతు కావడం ఖాయం’ అని సిఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భం గా చె ప్పిన జోస్యం వందుకు వందశాతం ఫలించింది. ఇదే కాకుండా తమ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 వేల మెజార్టీ సాధించబోతున్నారని సీఎం చెప్పిన మాట కూ డా కాస్త అటు ఇటుగా (25 వేలు) నిజమైంది. ప్ర స్తుతం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కటే అయినప్పటికీ ఈ ఫ లితం రాజకీయంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, అటు కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేసినట్లు అయింది. మ రోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక, నేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాధించిన వరుస విజయాలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను మరింత బలహీన పరిచినట్టు అయింది. ఇదే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డికి వ్యక్తిగతంగా కూడా పార్టీపై, ప్రభుత్వంపై పట్టుబిగించడానికి, అలాగే అధిష్టానం వద్ద తన ప్రతిష్ట పెంచుకునేందుకు దోహదం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇది రెండవ విజయం. మొదటి విజయం సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండవ విజయంగా ఆయన ఖాతాలో పడింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత లేదని కూడా ఈ ఎన్నికల ఫలితం పరోక్షంగా చాటి చెప్పినట్లు అయింది. ఒకరకంగా ఈ ఫలితం తమ రెండేండ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన రెఫరాండమ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించాలనుకుంటున్న స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ చేసినట్టు అయింది. అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న జూబ్లీహిల్స్ జోష్‌తో స్థానిక ఎన్నికలపై రెండు మూడు రోజులల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించడం గమనార్హం.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్ కు జరిగిన ఉప ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ మంచి మెజార్టీ సాధించగలిగారని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకుగాను ఒక్కో డివిజన్‌కు ఇద్దేరేసి మంత్రులను ఇంచార్జీలుగా నియమించడంతో పాటు తానే స్వయంగా ప్రతి డివిజన్‌లో రోడ్ షోలు నిర్వహించారు. తమ రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్ల ముందు ఉంచారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో నిర్లక్షానికి గురైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దాదాపు రూ. 400 కోట్లు మంజూరు చేయడంతో పాటు అప్పటికప్పడు నిధులను విడుదల చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. మరోవైపు ఇక్కడ ముస్లిం మైనార్టీల జనాభా అధికంగా ఉండటంతో వారిని ఆకట్టుకునే వ్యూహంతో ముందుగానే ఎంఐఎం పార్టీతో మద్దతు కూడగట్టుకోవడంతో పాటు అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి వ్యూహత్మక ఎత్తుగడల వల్ల ఆ వర్గం ఓటు బ్యాంక్‌ను గంపగుత్తగా పొందడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధానంగా కలిసివచ్చిన అంశం.
ఇప్పటికే ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటి చేసిన నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశం ట్రెండింగ్‌గా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన మరో అంశం. ఇక్కడ వరుసగా మూడు పర్యాయాలుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే గెలవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతి వల్ల వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా బరిలోకి దించింది. ఆమె భర్త ఆకస్మిక మృతి కారణంగా సునీతకు సానుభూతి ఓట్లు కలిసివస్తాయని బీఆర్‌ఎస్ భావించింది. కానీ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టే అనవాయితీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా తూట్లు పొడించింది సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రచారంలో తిప్పకొట్టడం లో కృతకృత్యులయ్యారు. దీనికి తోడు మాగంటి గోపినాథ్‌కు మొదటి భార్య గా ఒక ఆవిడ, ఆమెకు మద్దతుగా గోపినాథ్ తల్లి పోలింగ్‌కు ముందు చేసిన విమర్శలు, ఆరోపణలు కూడా సానుభూతి ఓట్లకు గండికొట్టడం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది.