న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబరు 14) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తరువాత ఉదయం 8.30 గంటలకు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్‌ఒ)లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్‌ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవిఎం కౌంటింగ్ సమయంలో కౌంటింగ్‌టేబుళ్ల వద్దకు కంట్రోల్ యూనిట్లు ఇవిఎంలను తీసుకు వస్తారు. వాటి సీళ్లను తనిఖీ కోసం కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు.
ఇవిఎంలో రికార్డయిన ఓట్ల సంఖ్యను ఫారం 17 సి ఎంట్రీలతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా సరిపోకపోతే వివిపిఎటి స్లిప్‌లతో సరిచూస్తారు. ఇవిఎం కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గాల వారీగా ఐదు పోలింగ్ స్టేషన్లను యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకుని వివిప్యాట్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వివిప్యాట్ స్లిప్పులను ఇవిఎం ఫలితాలతో సరిచూస్తారు. రౌండ్ల వారీగా, నియోజకవర్గాల వారీగా లభించిన ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ సంకలనం చేసి అధికారిక ఇసి ఫలితాల పోర్టల్‌లో ప్రదర్శిస్తారు. ఫలితాల కచ్చితమైన సమాచారం కోసం అనధికారిక సమాచారంపై ఆధారపడకూడదని, ఇసి అధికారిక ఫలితాల పోర్టల్ లోనే చూసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈమేరకు టివి ఛానల్స్,ఇంటర్నెట్ మీడియా ఛానల్స్‌కు కూడా సూచించింది.
243 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కౌంటింగ్
మొత్తం 243 నియోజకవర్గాల్లో ఈమేరకు విస్తృతంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఒ)లు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్‌ను పరిశీలిస్తారు.