మన దేశంలో చాలా మందికి అత్యంత ధనవంతులు ఎంత దానం చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీనిపైనా పలు సంస్థలు ఎప్పటికప్పుడు డేటా విడుదల చేస్తుంటాయి. ఈ సంవత్సరంలో ఏకంగా రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో మొత్తం 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తవారే ఉన్నారు. గత మూడేళ్లలో చూస్తే వీరి విరాళాల మొత్తం 85 శాతం పెరగడం గమనార్హం. టాప్-10 లిస్టులో ఉన్న వారి విరాళాల మొత్తమే రూ. 5,834 కోట్లుగా ఉంది. అత్యంత ధనవంతుల్లో అంబానీ, అదానీ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ.. దాతృత్వంలో మాత్రం తొలి స్థానం శివనాడర్ దే. మనిషి సంఘజీవి. ఇతరులతో వ్యవహరించే క్రమంలో మనిషి.. ఆయా పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంటాడు. వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే, కొన్ని ప్రతికూల స్పందనలు. సుగుణాల విషయానికి వస్తే.. అందులో దయాగుణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సాటి మనిషితో దయతో వ్యవహరించాలని మన సంస్కృతి మనకు బోధిస్తుంది. మనం ఒక తల్లి బిడ్డలుగా మసలుకోవాలని, తోటివారి కష్టసుఖాలను ఓ కంటకనిపెట్టి వారిని ఆదుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతుల్లోనూ ఈ భావన కనిపిస్తుంది. అయితే మానవుడి జీవన వేగం పెరగటం, ప్రపంచీకరణ వంటి పలు ప్రభావాలవల్ల మనిషి జీవన వేగం పెరిగింది. ఈ క్రమంలో తోటివారి సంగతి కాసేపు పక్కన పెడితే.. సొంత తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో సొంతలాభం కొంత మాని.. పొరుగువారి గురించి ఆలోచించాలని మనకు గుర్తుచేస్తోంది..
1997లో జపాన్‌లోని టోక్యోలో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్‌మెంట్ మొదలైంది. వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, జాతుల మధ్య, సమాజాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య కూడా వెల్లివిరిసి ‘వసుధైక కుటుంబం’ అనే స్వప్నం సాకారం కావాలని జరిగిన తొలిసమావేశంలో నిర్వాహకులు ప్రకటించారు. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనవంతుగా ఏమైనా తిరిగివ్వాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీదా ఉందనే సంకల్పాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. క్రమంగా ఈ సందేశం ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలకు చేరింది. దీంతో ఆయా దేశాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. 1998 తర్వాత ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది, 2005లో యుకెలో, 2009 నాటికి సింగపూర్, 2010లో ఫ్రాన్స్, అమెరికా ఇలా 2019 నాటికి, ఈ ఉద్యమం 27 దేశాలకు వ్యాపించింది. 2025 నాటికి మరిన్ని దేశాలు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సమాజంలో ఆర్థికపరమైన అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుండగా, ధనికుల వద్ద మరింత సంపద పోగుపడుతోంది. ఈ అంతరాలను గుర్తించిన ప్రభుత్వాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సంపన్నుల నుంచి కొంత పన్ను వసూలు చేసి పేదలకు వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎపిలోని కూటమి సర్కారు ఈ ఏడాది ఉగాది నాడు.. పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్ షిప్ అనే నాలుగు అంశాలతో కూడిన ఈ కార్యక్రమం కింద జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విరాళాలు ఇచ్చే సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా, పేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఈ సాయం పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తోంది. సంపన్నుల నిధులను ఇళ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, సోలార్, స్వయం ఉపాధి అందించటం వంటివాటికి ఖర్చు చేస్తున్నారు.
అలాగే, మన దేశంలోని అనేక మంది సంపన్నులు దయాగుణంతో పేదల సేవకై ముందుకొస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఒక్క ఏడాదిలో వారు రూ. 10 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024- 25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. అంటే రోజుకు సుమారు రూ.7.4 కోట్లు అన్నమాట. తరవాతి స్థానాల్లో రూ. 626 కోట్లతో ముకేష్ అంబానీ, రూ. 446 కోట్ల విరాళాలతో మూడవస్థానంలో బజాజ్ కుటుంబం నిలిచాయి. హురున్ ఇండియా నిరుటి జాబితాలో 203మంది నిలవగా, తాజా జాబితాలో 191మంది చోటు దక్కించుకున్నారు.అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ. 43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది. మన పొరుగుదేశం చైనా జిడిపి దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జిడిపి 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది. ఇతరులకు సాయం చేయటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని మన సమాజం వీలయిన మేర వినియోగించుకోవాలి. దానినో అరుదైన అవకాశంగా భావించాలి. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనం ఆ మాత్రం చేయలేకపోతే..మన సమాజంలో ఎంత సంపద, జ్ఞానం ఉన్నప్పటికీ,అది నరకప్రాయంగానే మారుతుంది.
ఐనం ప్రసాద్, 98489 28787