తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జనం మాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. ఘనాపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు అయిన ఘనాపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం స్థానిక నాయకులు ప్రయత్నం చేసి, మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
ఆనకట్ట ఎత్తు పెంపు పనుల పూర్తికి 30 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన రైతులకు చెల్లించాల్సిన పరిహారం కింద రూ.13 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన రైతులతో మాట్లాడతామని కవిత తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచడం వలన ముఖ్యంగా ఏడుపాయల ఆలయానికి కలిగే ప్రయోజనాన్ని ఆమె వివరించారు. ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా ముంపుకు గురవుతోంది. ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అమ్మవారి ఆలయం ముంపుకు గురికాకుండా ఉంటుందని కవిత పేర్కొన్నారు. అమ్మవారి దయవల్ల ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచి, అమ్మవారి ఆలయమునగకుండా చూడాలని మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కవిత తెలిపారు.