బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓ మెరుపు మెరిసింది. ఎన్నికల్లో బరిలో నిలిచే అర్హత కలిగిన పాతికేళ్ల యువతి, జానపద గాయని మైథిలి ఠాకూర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ విజయం సాధించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున బరిలో దిగిన ఆమె ఆర్‌జెడికి చెందిన 63 ఏళ్ల అభ్యర్థి వినోద్ మిశ్రాపై 12వేలకుపైగా ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. తొలి ప్రయత్నంలో విజయం సాధించడమే కాకుండా అసెంబ్లీ అత్యంత చిన్న వయస్కురాలైన ఎంఎల్‌ఎగా రికార్డు సాధించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు తెలంగాణకు చెందిన మైనంపల్లి రోహిత్‌పై ఉండేది. ఆయన 26 ఏళ్ల వయసులో బరిలో దిగి ఎన్నికయ్యారు. తాజాగా ఆ రికార్డును మైథిలి సొంతం చేసుకున్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అలీనగర్ పేరును సీతానగర్‌గా మార్చుతానని ఆమె హామీ ఇచ్చారు.