దేశవ్యాప్తంగా పలు నగరాలు, సునిశిత పట్టణాలు, ప్రాంతాలలో భారీ స్థాయిలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడులకు కుట్ర జరిగింది. ఎర్రకోట వద్ద కారులో భారీ స్థాయి పేలుడు, 13 మంది దుర్మరణం తరువాతి దర్యాప్తు క్రమంలో ఇంటలిజెన్స్ అధికారులు ఈ కీలక సమాచారం రాబట్టారు. మొత్తం 32 కార్లు , ఇతరత్రా వాహనాలలో భారీ పేలుడు పదార్థాలను తీసుకువెళ్లి , జనసమ్మర్థపు ప్రాంతాలలో అదును చూసుకుని పేల్చివేసేందుకు, తద్వారా కల్లోలం సృస్టించేందుకు పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల సహకారంతో పూర్తి సమన్వయంతో కుట్రకు దిగినట్లు ఇప్పుడు దర్యాప్తు వేగవంతం క్రమంలో స్పష్టం అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి కారులోనూ శక్తివంతమైన పేలుడు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకువెళ్లేందుకు తగు విధమైన ఏర్పాట్లు జరిగినట్లు పసికట్టారు. ఇందుకు ఉగ్రశక్తులు హ్యుండాయ్ ఐ20 , ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఆధునీకరించిన కార్లను వాడాలని వ్యూహరచనకు దిగారు. దేశంలో పలు చోట్ల వరుస పేలుళ్లకు ఇప్పటికే ఈ కార్లు సిద్ధం అయ్యాయా? ఉంటే అవి ఎక్కడున్నాయనేది ఇప్పుడు ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తు క్రమంలో కీలక అంశం అయింది.
పేలుడు పదార్థాలను అమర్చి ఉన్న వాహనాలను రంగంలోకి దింపాలని ఉగ్రశక్తులు ఫక్కా ప్రణాళికలు రూపొందించుకున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగా కనుగొన్నాయి. ముందుగా దాదాపు ఎనిమిది మంది నాలుగు ప్రాంతాలలో సమన్వయరీతిలో పేలుళ్లకు దిగాలని సిద్ధం అయ్యారు. ఇందులో ఇద్దరేసి చొప్పున నాలుగు ప్రాంతాలలో దాడికి వ్యూహరచనకు దిగారు. వారు నిర్ణీతంగా ముందుగా కొన్ని నగరాలను ఎంచుకున్నారని వెల్లడైంది. బహుళ స్థాయి పేలుడు పరికరాలు (ఐఇడి)లతో ఒకేసారి ధ్వంసానికి దిగాలని చూశారు. ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్, డాక్టర్ ఉమర్ , డాక్టర్ షహీన్‌లకు ఇంతకు ముందటి ఉగ్రవాద చర్యల కేసులతో కూడా లింక్‌లు ఉన్నట్లు వెల్లడైంది. వీరి ప్రధాన కార్యాచరణతోనే 32 కార్లలో పలు ప్రాంతాలలో పేలుళ్లకు కుట్ర జరిగిందని ఇప్పుడు పట్టుబడి, ఇంటరాగేషన్‌లో ఉన్న వారి వివరణలతో వెల్లడిఅయింది. అయితే ఉగ్రదాడుల భయం ఇప్పటికీ ఉందా? లేక దీనిని భద్రతా సిబ్బంది సకాలంలోనే అడ్డుకోగలిగారా? అనేది స్పష్టం కాలేదు. ఢిల్లీ, అయోధ్య ఇతర నగరాలలో బాబ్రీ మసీదు కూల్చివేత దినం డిసెంబర్ ఆరు బ్లాక్‌డే నాడే పేలుళ్లకు కార్యాచరణకు దిగినట్లు అనమానిస్తున్నారు