మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని రాష్ట్ర డిప్యూటీ సి ఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో కాకతీయ నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు తాము లేకపోతే కరెంటే ఉండదు రాష్ట్రం అంధకారమవుతుందని అన్న విషయాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసింది రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని ఆయన అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం అన్నారు. ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని కలిసి మాట్లాడినట్టు తెలిపారు. ఇల్లు లేని పేదలు 10 సంవత్సరాల పాటు టిఆర్‌ఎస్ పాలనలో ఎదురుచూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తన చేయి పట్టుకొని తెలిపిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే పాదయాత్ర సందర్భంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చాను, నీ ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నాం, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు.
ఒకటి కాదు రెండు కాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు తాను వచ్చే క్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కలిసి వారితో ఆనందాన్ని పంచుకున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు అంబటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు,కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు, సామినేని వెంకటయ్య, ఏడుకొండలు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.