మన తెలంగాణ/రాజేంద్రనగర్: హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్ లో పట్టుబడ్డ నగరానికి చెందిన ఉగ్ర డాక్టర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోర్ట్ వ్యూ కాలనీకి చేరుకున్న ఐదుగురు సభ్యులు గల యాంటీ టెర్రరిస్ట్ బృందం డాక్టర్ అహమ్మద్ నివాసంలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఈ ఉగ్ర కుట్రలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకుపైగా సోదాలు జరిపారు. ఆముదంతో తయారు చేసిన రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు గుజరాత్ పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం.
తనిఖీలు చేపట్టిన గుజరాత్ పోలీసులు స్థానిక రాజేంద్రనగర్ పోలీసులను సైతం లోపలికి అనుమతించలేదని తెలుస్తుంది. ఇదే కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అజాద్, సలీంఖాన్ ఇళ్లలోనూ ఎన్ టి ఎస్ సోదాలు జరిపినట్లు సమాచారం. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలను వివిధ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. రెండు రోజుల్లో గుజరాత్ కు రావాలని డాక్టర్ కుటుంబానికి యాంటీ టెర్రరిస్ట్ పోలీసు బృందం ఆదేశించింది. కానీ, ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ స్నేహితుడి మాయమాటలకు ఆకర్షితులై డాక్టర్ అహ్మద్ బలి అయ్యాడని అతడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే పక్క ఆధారాలతోటే యాంటీ టెర్రరిస్ట్ బృందం అతన్ని అరెస్టు చేయడంతో పాటు తీవ్రవాద సంస్థకు పని చేస్తున్నట్లు నిర్ధారించిన అనంతరమే అరెస్టు చేసినట్లు స్పష్టమవుతుంది.