రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. మంత్రిపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసును గురువారం ఆయన ఉపసంహరించుకున్నారు. మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్న క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ట్విటర్ వేదికగా నాగార్జున కుటుంబపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు.
నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, వారిని ఇబ్బంది పెట్టాలని, వారి పరువు ప్రతిష్టకు భంగం కలిగించాలని ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంభంపై చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా, నా వాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని మంత్రి పేర్కొన్నారు. ఈ క్షమాపణపై నాగార్జున స్పందించి మంత్రిపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు. కాగా, మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ సాగింది. ఈ విచారణను అంతకు ముందు డిసెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో నాగార్జున కేసు ఉప సంహరించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లుయింది.