23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.