జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని బిఆర్‌ఎస్ పార్టీ ధీమాగా ఉన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పార్టీ నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్ నాయకులను, ప్రముఖులను ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. ఈ ఏజెంట్లందరితో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు తదితర ముఖ్య నేతలు గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై మార్గదర్శనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ సందర్భంగా అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు చేసే అవకాశం ఉందో వివరించినట్లు బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్‌ఎస్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ జాగ్రత్తగా వ్యవహిరిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకున్నది.