న్యూఢిల్లీ: పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న రెండు పెద్ద కంటైనర్ ట్రక్కులు ఢీకొన్నాయి. అయితే, వాటి మధ్య కారు ఇరుక్కుపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారుతోపాటు కంటైనర్ ట్రక్కులు కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పుణే నగర శివార్లలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. సాయంత్రం రద్దీ సమయంలో ప్రమాదం జరగడంతో సింహ్‌గడ్ రోడ్, వార్జే, కాట్రాజ్-దేహు బైపాస్‌లలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. కంటైనర్ ట్రక్కుల మధ్య కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులను ఇంకా గుర్తించలేదని.. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.