యూనివర్సిటీ నిధులు, వైద్యుల ఆర్థిక లావాదేవీలపై ఇడి దర్యాప్తు
తప్పుడు అక్రిడిటేషన్ క్లయిమ్ పై ఎన్ ఏఏసి నోటీసులు
విశ్వవిద్యాలయం వెబ్ సైట్ తొలగింపు
వర్సిటీపై చర్యకు సిద్ధమైన నేషనల్ మెడికల్ కమిషన్
న్యూఢిల్లీ
ఎర్రకోట పేలుడు తర్వాత టెర్రరిస్ట్ కుట్రకు సంబంధించి రోజురోజుకూ కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండడంతో హర్యానాలోని అల్ -ఫలాహ్ యూనివర్సిటీకి కొత్త ఇబ్బందులకు అంతు లేకుండా పోయింది. ఆ యూనివర్సిటీకి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి. వర్సిటీ గుర్తింపు ఎన్నాళ్లవరకూ ఉంది అన్న విషయంతో సహా పలు విషయాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఎర్రకోట పేలుళ్ల నిందితులు యూనివర్సిటీలో పనిచేయడం తో వారికి జైష్ -ఎ- మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో గల సంబంధాలపై ఆరా మొదలైంది.గరువారం తప్పుడు అక్రిడిటేషన్ క్లెయిమ్ ను ప్రదర్శించినందుకు ఎన్ ఏఏసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫలితంగా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను తొలగించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి, విశ్వవిద్యాలయ నిధులతోపాటు, దాని వైద్యుల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది.
ఎర్రకోట వద్ద పేలుడుతో ఫరీదాబాద్ లోని దౌజ్ గ్రామంలో ఉన్న ఈయూనివర్సిటీ దేశంలో అందరి దృష్టిలోనూ పడింది. కారు పేలుడుకు పాల్పడి 13 మంది మృతికి కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ ఇక్కడే పని చేస్తున్నాడని తేలింది. ఉమర్ తోపాటు అతడి ఇద్దరు సహచరులు, వైట్ కాలర్ టెర్రరిస్ట్ నెట్ వర్క్ లో కీలక పాత్ర ధారులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా ఈ విశ్వవిద్యాలయంలో పని చేసినవారే. టెర్రరిస్ట్ మాడ్యూల్ ను ఛేదించి ముజమ్మిల్, షాహీన్ అరెస్ట్ లతో యూనివర్సిటీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అరబిక్ లో అల్ -ఫలాహ్ అంటే, విజయం లేదా శ్రేయస్సు అని అర్థం. కానీ ఈ వారం పరిణామాలతో విశ్వవిద్యాలయం స్థాయి పూర్తిగా దిగజారి పోయింది.
అక్రిడిటేషన్ గడువు ముగియడంతో నోటీసు
గురువారంనాడు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్ ఏఏసి యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ అక్రిడిటేషన్ గడువు ముగిసిందని, సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకో కూడదో చెప్పాలని నిలదీసింది. యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రదర్శించబడిన గ్రేడ్ ఏ అక్రిడి టేషన్ పూర్తిగా తప్పు అనీ, ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఎన్‌ఏఏసి పేర్కొంది. యూనివర్సిటీ ఏడు రోజులలో స్పందించాలని గడువు విధించింది.అల్- ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కి గల -గ్రేడ్ ఏ -గుర్తింపు 2018లోనే ముగిసింది. అల్ -ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు 2011 నుంచి 2016 వరకు చెల్లుబాటులో ఉంది. మరో పక్క నేషనల్ మెడికల్ కమిషన్ కూడా యూనివర్సిటీపై తగిన చర్య తీసుకునేందుకు సిద్ధమైంది.
అల్- ఫలాహ్ వర్సిటీపై ఈడీ ఆరా
ఢిల్లీ పేలుడు కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో యూనివర్సిటీ, అందులో పనిచేసే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈడీ డైరెక్టర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈడీ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ల కు బదిలీ అయిన నిధుల పై దర్యాప్తు తీస్తుంటే,ఢిల్లీ పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ ఐఏ ఫరీదాబాద్ మాడ్యూల్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల అంశాన్ని పరీశీలిస్తుంది.
అల్- ఫలాహ్ వర్సిటీలో పోలీసులు
మరో పక్క హర్యానా పోలీసులు రంగంలోకి దిగి యూనివర్సిటీలోని 50 మందికి పైగా ఉద్యోగులు, ఆస్పత్రికి సంబంధించిన వైద్యులను ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలో డాక్టర్ల రిక్రూట్ మెంట్ కు అనుసరించిన విధానాన్ని ఆరా తీస్తున్నారు.పేలుడుకు కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ గతంలో అనంతనాగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేవాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి చనిపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినా, ఆ విషయాన్ని పట్టించుకోకుండా 2023లో అల్- ఫలాహ్ లో డాక్టర్ గా నియమించడం పై దర్యాప్తు సాగుతోంది.