సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారని అన్నారు. ఇన్ని కోట్ల అప్పు తెచ్చి చేసిందేమీ లేదని విమర్శించారు. కాగ్ రిపోర్ట్ సిఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే… ఇంతకంటే ఏం జరుగుతుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతికి అర్రులు చాస్తూ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని కుదేలు చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ.. రేవంత్ రెండేండ్ల పాలనలో అధోగతి పాలైందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. నిర్ధేశించుకున్న లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని, జిఎస్‌టి వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతంలోపే వచ్చిందని, అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.హైడ్రా పేరుతో ఆర్‌ఆర్ టాక్స్‌తో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.