ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026 కోసం వచ్చే నెలలో మినీ వేలం పాట నిర్వహించనున్నారు. అబుదాబి వేదికగా డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం పాట జరిగే అవకాశాలున్నాయి. ఈ వేలం పాటలో సరికొత్త నిబంధనలను అమలు చేసేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈసారి వేలం పాటలో పాల్గొనే వారికి కొన్ని షరతులు విధించే అవకాశాలున్నాయి.
ఈసారి వేలం పాటలో ఎంత మంది ఆటగాళ్లనైనా ఫ్రాంచైజీలు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితి లేదు. వేలం పాట పక్రియ గురించి కొన్ని విషయాలను బిసిసిఐ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక సీజన్ ముగిసిన నెల రోజుల తరవాత ఐపిఎల్ ట్రేడ్ విండో మొదలవుతుంది. దీని వల్ల ఆటగాళ్లను మార్చుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలకు వెసులుబాటు ఉంటుంది. ఇది తదుపరి వేలం వారం ముందు వరకు కొనసాగుతోంది.
ట్రేడ్ విండోకు రెండు వెసులు బాట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి ప్లేయర్ ఫర్ క్యాష్ నిబంధన కాగా, రెండోది ప్లేయర్ టూ ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆప్షన్ ప్రకరం ఒక ఆటగాడిని ఇచ్చి డబ్బులు పొందడం. రెండో దానిలో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని తీసుకోవడానికి ఛాన్స్ లభిస్తోంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు తాము పొందాలనుకునే ఆటగాడి కోసం బిసిసిఐకి ఆసక్తి వ్యక్తీకరణ పంపాల్సి ఉంటుంది. ఆటగాడిని ఆమ్మే టీమ్ ప్రతిస్పందించడానికి 48 గంటల వరకు సమయం లభిస్తోంది. ఆటగాడు కొత్త జట్టులో చేరడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేస్తేను ప్లేయర్ ట్రేడ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది.