న్యూఢిల్లీ : ఎగుమతుల విషయంలో ప్రపంచ స్థాయిలో పోటీతత్వం పెరగడానికి, ఆత్మనిర్భర్ (స్వావలంబన) కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ఎక్స్‌పోర్టు ప్రమోషన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను ప్రధాని నరేంద్రమోడీ గురువారం వెల్లడించారు. బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగుమతిదారులకు ప్రోత్సాహకంగా ఎక్స్‌పోర్టు ప్రమోషన్ మిషన్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ఆమోదించారు.
ప్రపంచ మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా (భారత్‌లో తయారీ) లక్షం ప్రతిధ్వనించేలా ఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌కు నిర్ణయం తీసుకోవడమైందని , దీనివల్ల ఎగుమతుల్లో పోటీ తత్వం పెరుగుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, మొదటిసారి ఎగుమతులు చేపట్టేవారికి, కార్మిక శ్రమతో కూడిన రంగాలకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీకి కీలకమైన గ్రాఫైట్, సిసిఎం, రుబిడియం, జిర్కోనియం, తదితర ఖనిజాల రాయల్టీ రేట్ల విషయంలో హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. వీటి సరఫరా చైను పటిష్టమై, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వెలిబుచ్చారు.