తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామని కేంద్రంలోని ప్రభుత్వ నేతలు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఢిల్లీలో దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా భావించే ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. దేశరాజధాని కేవలం ప్రపంచంలో దారుణమైన కాలుష్యాన్ని ఆవహించిన నగరమే కాకుండా ఉగ్రభయం తో వణికిపోతున్న రాజధానిగా మారిపోతుంది. విదేశీ ఉగ్రవాదులతో సంబంధం గల నలుగురు వైద్యులను నాలుగు రోజుల్లో అరెస్ట్ చేసిన సమయంలో మరో వైద్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు వెల్లడికావడం ఆందోళన కావిస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోజు ఎర్రకోటకు సెలవు రోజు కావడంతో, అక్కడ జనసమర్ధన తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తక్కువగా జరిగింది. లేనిపక్షంలో ఎవ్వరూ ఊహించని దారుణం చోటుచేసుకొని ఉండెడిది.
పేదరికం, అక్షరాస్యత లేకపోవడం, నిరుద్యోగం వల్లే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారని దేశంలో పలువురు రాజకీయ వేత్తలు, విద్యావంతులు వారిపట్ల ఒక విధమైన సానుభూతితో మాట్లాడుతూ ఉంటారు. అయితే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు ఉగ్రవాద సంస్థలలో కీలక భూమిక వహిస్తున్నట్లు గత రెండు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కేరళ వంటి ప్రాంతాల నుండి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లిన వారి నుండి, దేశంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలలో క్రియాశీలంగా వహిస్తున్న వారిలో పలువురు ఉన్నత విద్యావంతులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్ (35) ను గుజరాత్‌లో అరెస్టు చేయడం భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది. చైనా నుండి మెడికల్ డిగ్రీ అందుకొన్న అతను ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషపూరిత పదార్థాన్ని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రసాదాలలో ఆ విషపదార్ధాన్ని కలిపి భారీ సంఖ్యలో జనాన్ని మట్టుపెట్టాలని అతను పథకాలు వేసుకున్నట్లు కనుగొన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలు రద్దు చేయడంతో అక్కడి ఉగ్రవాదంను కట్టడి చేసినట్లే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, తాత్కాలిక చర్యగా పేర్కొన్న జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఆరేళ్ళు దాటినా ఎందుకు వెనుకకు తీసుకొని, తిరిగి రాష్ట్ర హోదా కల్పించలేకపోతున్నారు? కేంద్ర హోం శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ శాంతిభద్రతలు నిర్వహిస్తున్నారు.
అయితే, సీమాంతర ఉగ్రవాదం ఇంకా అదుపులోకి రాలేదని ప్రభుత్వ చర్యలే స్పష్టం చేస్తున్నాయి.గతంలో యుపిఎ ప్రభుత్వం గాని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం గాని ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవడం లో చూపిన శ్రద్ధ దానిని అణచివేయడంపట్ల చూపడం లేదు. ఆపరేషన్ సిందూర్‌ను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేసారో ఇప్పటి వరకు ప్రభుత్వం దేశప్రజలకు నమ్మకమైన సమాధానం చెప్పలేకపోయింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వణికిపోయిందని, తిరిగి భారత్ వైపు చూసే సాహసం చేయబోదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నిత్యం చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగానే ఢిల్లీ పేలుడు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
25 ఏళ్ల క్రితం నాటి బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ‘జంగిల్ రాజ్’ వస్తుందని బీహార్ ప్రజలను ఎన్నికల సందర్భంగా భయపెడుతున్న ప్రధాన మంత్రి మోడీ ఎన్‌డిఎ పాలనలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నేరాల సంఖ్య పెరిగిన విషయాన్ని మరచిపోతున్నారు. 60 క్రితం చనిపోయిన మాజీ ప్రధాని నెహ్రూ విధానాలను ఇప్పటికీ నిత్యం విమర్శిస్తూ తమ ప్రభుత్వంలో దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతూ ఉండటం, వైషమ్యాలు పెరిగిపోతూ ఉండటం గురించి నోరు విప్పడంలేదు. యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులపట్ల రాజీధోరణి అవలంబించిందని విమర్శలు చేస్తుండే నేతలు తమ హయాం లో జరుగుతున్న ఉగ్రదాడుల గురించి నోరెత్తరు. 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు దర్యాప్తు నివేదికను బయటపెట్టలేదు. గత 11 ఏళ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులలో 600మంది వరకు మృతి చెందారు. వారిలో సగంమందికి పైగా 360 మంది వరకూ సైనికులు, పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు. గతంలో లేని విధంగా తరచూ సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరుగుతున్నాయి. నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆదాయ వనరులను కట్టడి చేశామని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. మెరుపు దాడులలో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. కానీ, సైనిక అధికారులే నియంత్రణ రేఖ అవతల దేశంలో ప్రవేశించేందుకు పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా సైన్యంలో కొత్త నియామకాలు దాదాపు ఆగిపోయాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ కార్యక్రమం గురించి స్పష్టమైన సమీక్షలు జరగడం లేదు. ఈ విషయంలో సైనికాధికారులకు, ప్రభుత్వంకు మధ్య దూరం పెరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. యుపిఎ హయాంలో అమెరికా ఒత్తిడి కారణంగానే బొంబాయి పేలుళ్ల తర్వాత భారత్ పాకిస్థాన్‌పై దాడి చేయలేదని అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం వెల్లడించారు.
కానీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అర్ధాంతరంగా ‘కాల్పుల విరమణ’ ఎందుకు జరపాల్సి వచ్చిందే పార్లమెంట్‌లో సైతం ప్రభుత్వం నోరువిప్పడం లేదు. తానే భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఆయనను నేరుగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఆయన వ్యాఖ్యలపట్ల అమెరికా రాయబారిని పిలిచి భారత్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు? తన ఒత్తిడులకు లొంగి భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గిస్తున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. అయినా భారత్ మౌనం వహిస్తున్నది. తాజా అరెస్ట్‌లతో సుదీర్ఘకాలంగా బిజెపి పాలనలో ఉన్న హర్యానా ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా మారుతున్నట్లు అనుమానించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంబైలో ఉగ్రదాడి జరగగానే అప్పటి యుపిఎ ప్రభుత్వం నాటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ ను బాధ్యుడిని చేస్తూ పదవినుండి తొలగించింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, పాకిస్తాన్ నుండి నేరుగా ఉగ్రవాదులు ముంబై వచ్చి ఉగ్రదాడి జరిపే అవకాశం లేదని, స్థానికంగా వారికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఉంటుందని అప్పట్లో అనేక మంది నిపుణులు స్పష్టం చేశారు. కనీసం నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా అప్పట్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో శివరాజ్ పాటిల్ వివాదాస్పదమైన ప్రవర్తన గురించి గాని, ఆ దాడిలో స్థానికుల ప్రమేయం గురించి గాని ఎటువంటి దర్యాప్తు జరిపిన దాఖలాలు లేవు.
గతంలో వాజపేయి ప్రభుత్వంలో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో, మోడీ ప్రభుత్వంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో గాని, పుల్వామా దాడి సమయంలో గాని ప్రభుత్వంలో ఎవ్వరినీ బాధ్యులను చేసే ప్రయత్నం చేయలేదు. యుపిఎ ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా పార్లమెంట్ పై దాడిలో అఫజుల్ గురును, ముంబై దాడిలో కసబ్‌ను ఉరితీశారు. అయితే లోతయిన దర్యాప్తులు జరగకపోవడంతో ఉగ్ర ఘటనలకు బాధ్యులైన కీలక వ్యక్తులు తప్పించుకుపోతున్నట్లు తెలుస్తున్నది. ఆయా దాడులకు స్థానికంగా అండగా ఉండి, కీలకమైన మద్దతు అందించినవారిని వదిలివేస్తున్నారు. అందుకు రాజకీయ అంశాలే కారణంగా భావించాల్సి వస్తుంది. ఈశాన్య ప్రాంతంలో సైతం తీవ్రవాద బృందాలు చాలా వరకు ఆయుధాలను వదిలిపెట్టి ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయని, ఇక ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని అమిత్ షా తరచూ చెబుతున్నారు. అయితే మణిపూర్‌లో రెండేళ్లకు పైగా కల్లోలకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సాహసం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలలో సైతం పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. మొన్నటి పహల్గామ్, తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలు దేశప్రజలు ఎటువంటి ఉగ్రభయం నీడలో ఉన్నారో వెల్లడి చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎన్నికల ప్రయోజనంకోసం ఓ ఆయుధంగా కాకుండా, దానిని కట్టడి చేసేందుకు పారదర్శకతతో, వ్యూహాత్మకంగా అడుగు వేయాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో ప్రభుత్వం విధానపరమైన దివాళాకోరుతనం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.
మీడియా సంస్థలను కట్టడి చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవచ్చని అధికారంలో ఉన్నవారు భావించవచ్చు. కానీ ఉగ్రవాదంపట్ల రాజీలేని వైఖరి అవలంబించేందుకు విధానపరమైన క్రియాశీలత చాలావసరం. అందుకు అనువుగా జాతీయ భద్రతా విధానం రూపొందించాలి. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైన్యం రక్షణ వ్యవస్థ గల భారత దేశంకు ఇప్పటి వరకు ‘జాతీయ రక్షణ విధానం’ లేకపోవడం దురదృష్టకరం. కార్గిల్ యుద్ధం తర్వాత నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ ప్రధాన సిఫార్సులతో జాతీయ రక్షణ విధానం రూపొందించడం అని గుర్తుతెచ్చుకోవాలి. దేశ ప్రజలను ఉగ్రవాద భయం నుండి ఆదుకునేందుకు ప్రభుత్వం రాజకీయ సంసిద్ధత ప్రదర్శించాలి. సంకుచిత ఎన్నికల రాజకీయాలకు అతీతంగా విధానపరమైన చొరువలు తీసుకోవాలి. ముందుగా దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. పార్లమెంట్‌లో పారదర్శకమైన చర్చలు జరగాలి. కేవలం బహిరంగ సభలలో కాకుండా పార్లమెంట్‌లో, మీడియా సమావేశాలలో, అఖిలపక్ష సమావేశాలలో విధానపరమైన అంశాలపై చర్చలకు ముందుకు రావాలి. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం అత్యవసరం. విదేశాంగ, రక్షణ విధానాలపై దృష్టి సారించాలి.
చలసాని నరేంద్ర
98495 69050