ఎర్రకోట వద్ద భారీ పేలుడు ఘటనతో లింక్ ఉందని అనుమానిస్తున్న ఎరుపు రంగు ఫోర్డు ఎకోస్పోర్ట్ కారును హర్యానాలో ఓ గ్రామం వద్ద గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఈ రెడ్ కార్ కోసం గాలిస్తున్నారు. ఈ కారులోనే నిందితుడు తిరిగినట్లు సాక్షాధారాలతో వెల్లడి అయింది. దీనితో ఢిల్లీ పోలీసు బృందాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నెంబరు డిఎల్10సికె 0458 కారును బుధవారం మధ్యాహ్నం ఖండావలీ గ్రామం వద్ద పార్క్ చేసి ఉండగా కనుగొన్నారు. ఈ కారు కోసం పోలీసు ఠాణాలకు సమాచారం అందించారు. చెక్ పోస్టులు, సరిహద్దుల తనిఖీ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశారు.అనుమానిత ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారని అధికార వర్గాలు తెలిపాయి. హ్యూండాయ్ ఐ20 కారుతో పాటు దుండగులు ఈ రెడ్‌కారును వాడినట్లు తెలిసింది. ఇప్పుడు దొరికిన కారు ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తి పేరిట 22నవంబర్ 2017 న రాజౌరి గార్డెన్‌లో నమోదు అయింది.
ఈ కారు డాక్టర్ ఉమర్‌కు చెందిన నివాసం వెలుపలనే కనుగొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కారు కోసం గాలింపు చర్యలు చేపట్టిన కొద్ది గంటల్లోనే దీనిని గమనించిన ప్రత్యేక పోలీసు బృందాలు కారును చుట్టుముట్టాయి. వాహనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయనే జాగ్రత్తతో వెంటనే సంబంధిత నిపుణులను రప్పించి లోపల తనిఖీలు చేపట్టారు. ఈ కారు ఉమర్ ఉన్ నబీ అలియాస్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ పేరిట నమోదు అయింది. ఆయన కారుకు రెండో ఓనర్ అని తేలింది. ఈశాన్య ఢిల్లీలో తప్పుడు చిరునామాతో ఉమర్ దీనిని రిజిస్టర్ చేసుకున్నాడని నిర్థారించారు. ఉగ్రపేలుళ్ల చర్యకు ఈ రెడ్‌కారును రెండో వాహనంగా వాడుకున్నారని వెల్లడైంది. ఈ కారులోనే ఉగ్రవాదులు పలు ప్రాంతాలలో రెకీలు నిర్వహించి ఉంటారని, ఆయుధాల పంపిణీ, సేకరణకు దిగి ఉంటారని అనుమానిస్తున్నారు.