కోల్‌కతా: నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు తొలి టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ సిరీస్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ డైనమిక్ బ్యాటర్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో 90 సిక్సర్లు బాదాడు. మరో సిక్స్ కొడితే.. అత్యధిక సిక్సులు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.
ఈ లాంగెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా లెజండరీ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట రికార్డు ఉంది. ఆయన టెస్టుల్లో మొత్తం 90 సిక్సలు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులోనే పంత్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టే చాన్స్ ఉంది.వీరి తర్వాత రోహిత్ శర్మ 88 సిక్సులు బాదాడు. అయితే, రోహిత్ రిటైర్ కావడంతో ఈ రికార్డును అధిగమించలేడు. ఇక, రవీంద్ర జడేజా కూడా టెస్టుల్లో 80 సిక్సర్లు కొట్టాడు.ప్రస్తుతం జడేజా టెస్టులో కొనసాగుతున్నా.. పంత్ ను రికార్డును బ్రేక్ చేయడం కష్టమే.
కాగా, ఈ సిరీస్ తో పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్.. ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణాఫ్రికా Aతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా A తరపున బరిలోకి దిగి జట్టుకు విజయాన్ని అందించాడు.