ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్లు అదిల్, ముజమ్మిల్‌ల అరెస్ట్, 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత జరిగిన విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. జమ్మూ కశ్మీర్‌లోని ఉమర్ నబీ సొంతూరు కోయల్‌కు పోలీసులు వెళ్లే వరకు అతడు ఢిల్లీ పేలుళ్లలో ప్రధాన పాత్రధారి అని కుటుంబీకులతో సహా గ్రామస్థులు ఎవరికీ తెలియదు. కోయల్ గ్రామంలోని ఉమర్ నివాసంలో పోలసులు తనిఖీలు నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉమర్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉమర్ సన్నిహితుడైన వైద్యుడు డాక్టర్ సజాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉమర్‌కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పరీక్షలున్నాయి.. ఫోన్ చేయవద్దన్నాడు
ఉమర్ నబీ కుటుంబ సభ్యురాలైన ముజామిల్ మాట్లాడుతూ.. పోలీసుల రాకతో తామంతా షాక్‌లో ఉన్నామన్నారు. ఢిల్లీ ఘటన వెనక మా ఉమర్ ఉన్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఫరీబాద్‌లోని ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నాడని, శుక్రవారంనాడు ఫోన్ చేసి తనకు పరీక్షలు ఉన్నాయని, మూడు రోజులు బిజీగా ఉంటానని, తనకు అప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయవద్దని సూచించాడని వివరించారు. పరీక్షలు ముగిశాక మూడు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని తెలిపారు. ఉమర్‌కు పెద్దగా స్నేహితులు కూడా లేరని, ఎవరితోనూ అంతగా కలుపుగోలుగా ఉండేవాడు కాదని చెప్పారు. ఎంతో కష్టపడి అతడ్ని చదివించామని, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశించామని ఆవేదనగా ముజామిల్ వివరించింది. రెండు మాసాల క్రితం ఉమర్ కశ్మీర్‌కు వచ్చి వెళ్లాడని, ఆ తర్వాత మళ్లీ రాలేదని ఆమె తెలిపింది.