200 శక్తివంతమైన ఐఈడీలు సిద్ధం
ఎర్రకోట, ఇండియాగేట్ సహా పలు ఆలయాలు, ప్రార్థన మందిరాలు టార్గెట్
జనవరి నుంచే కుట్రలు, అనుమానం రాకుండా డాక్టర్లతో అమలుకు చర్యలు
ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్, ఫతేపూర్ టాగాలో అద్దె ఇళ్లు
దీపావళి రోజునే పేలుడుకు పన్నాగం, చివరి క్షణంలో మార్పు
టెర్రర్ మాడ్యూల్ విచారణలో వెలుగుచూస్తున్న సంచలన విషయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక ప్రాంతాలలో భారీఎత్తున దాడులు నిర్వహించి, విధ్వంసం సృష్టించడమే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రకోట వద్ద కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించిన తర్వాత వరుస దాడులకు ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న క్రమంలో సంచలన విసయాలు వెల్లడవుతున్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ , గౌరీ శంకర్ ఆలయంతో సహా రాజధాని నడిబొడ్డున పలు కీలక ప్రాంతాలు వాళ్ల టార్గెట్ అని కారుబాంబు పేలుడు ఘటనపై జరుపుతున్న దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఆలయాల్లోనూ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారని తేలింది.
2008 నవంబర్ 26న ముంబై దాడుల సమయంలో తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్, ట్రెడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ హాస్పిటల్ తో సహా 12 ప్రదేశాలలో కాల్పులు జరిపి భారీ విధ్వంసానికి, మారణోమానికి ఉగ్రవాదులు పాల్పడ విషయం తెలిసిందే. ఢిల్లీలో పేలుళ్లకు ఈ ఏడాది జనవరి నుంచే పన్నాగాలు పన్నుతున్నారని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్‌ఎ-మొహమ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠా నెలల తరబడి ఈ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో కూడా కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు 200 శక్తివంతమైన ఐఈడీలు, బాంబులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది.
మతకల్లోలాలూ సృష్టించే కుట్ర..
దేశంలో మతకల్లోలాలు సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా పేలుళ్లకు పథకం వేశారని, ఇందుకోసం జమ్మూకశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, అనంతనాగ్ కు చెందిన కొందరు డాక్టర్లను ఈ దారుణకాండకు ఎంచుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా వారు ఈ పన్నాగాలు పన్నుతూ వచ్చారని, డాక్టర్లు కావడంతో వారిని పెద్దగా ఎవరూ అనుమానించరని భావించారన్నారు.
ఈ బ్యాంక్‌గ్రౌండ్‌తోనే దేశరాజధాని ప్రాంతంలో ఎక్కడికైనా వారు సులభంగా తిరగగలిగారని, ఆ ముసుగులోనే దౌజ్, ఫతేపూర్ టాగా ప్రాంతాలలో వారు పేలుడు పదార్థాలు నిల్వ చేయడానికి గదులను అద్దెకు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. దీపావళి పండుగనాడే రద్దీగా ఉండే ప్రదేశాలలో దాడి చేయాలని టెర్రరిస్ట్‌లు ముందుగా ప్లాన్ చేసినా, ఆ పథకం ఎందుకో పారలేదు. బాంబు తయారీలో ఉపయోగించే 2,900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ అయిన ముజిమ్మిల్ ఈ విషయాలు తెలిపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సయీద్ ముజిమ్మిల్ అల్ – ఫలాహ్ లో పనిచేస్తూ, టచ్ లో ఉండేవారని, సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్, మందుగుండుసామగ్రి దొరికిన తర్వాత ఆమె అరెస్ట్ అయినట్లు తెలిపారు.