ఫరీదాబాద్‌లో తన అద్దె ఇంటిలో పేలుడు పదార్ధాలను నిల్వచేయడానికి సహకరించాడన్న నేరారోపణపై హర్యానాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపు లోకి తీసుకుని బుధవారం శ్రీనగర్‌కు తీసుకు వచ్చారు. ఆయన అద్దె ఇంటి నుంచి పేలుడు పదార్ధాలైన 2900 కిలోల అమోనియా నైట్రేట్, పొటాసియం క్లోరేట్ , సల్ఫర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 360 కిలోలు మండే స్వభావం కలిగిన అమోనియం నైట్రేట్‌గా గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మేవత్‌కు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్శిటీ క్యాంపస్‌లో మతబోధనలు చేస్తుంటాడు.
యూనివర్శిటీకి సమీపాన తాను అద్దెకు ఉంటున్న నివాసంలో పేలుడు పదార్ధాల నిల్వ ఉంచేలా సహకరించాడని పోలీసుల దర్యాప్తు లో తేలింది. ఎర్రకోటవద్ద జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడితో సంబంధం ఉన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నేరం కింద ఈ అరెస్టు జరిగింది. ఈ పేలుడు పదార్ధాలను డాక్టర్ ముజమ్మిల్ అలియాస్ ముసాయిబ్ ,డాక్టర్ ఉమర్‌నబీ నిల్వచేశారు. ఎర్రకోట పేలుడుకు వినియోగించిన కారును డాక్టర్ ఉమర్‌నడీ డ్రైవ్ చేసినట్టు తెలిసింది. ఎర్రకోట కేసులో ఇంతవరకు అరెస్టు అయిన వారిలో మౌల్వీ తొమ్మిదో వ్యక్తి అవుతాడు.