తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్‌ల కుమారుడు విశ్వతేజ (17) కావడంతో పెద్దపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్‌ల కుమారుడైన విశ్వతేజ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లనని తల్లిదండ్రులతో గొడవ పడడంతో వారు మందలించారు. దీంతో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో విశ్వతేజ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావి(ఈత బావి) సమీపంలో అతడి చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దాదాపు రెండు గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం వ్యవసాయ బావిలో విశ్వతేజ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతితో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ప్రజాప్రతినిధులు, బంధువులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని శోకార్తులైన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సతీమణి పావని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూపసురేందర్‌ల నివాసానికి వెళ్లారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి పావని మృతుడు విశ్వతేజ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అఎమ్మెల్యే సతీమణి పావని వెంట పరామర్శించిన వారిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్‌విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.