మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు కల్పించారు. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేరణతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని మాలిక్ వివరించాడు. కఠోర సాధన, అంకిత భావం వల్లే జాతీయ జట్టులో స్థానం సంపాదించే స్థితికి చేరారని వివరించాడు. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో భారత్ అండర్19 టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు తెలిపాడు.
టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన చిరకాల స్వప్నమని, దాని కోసం సర్వం ఒడ్డి పోరాడుతానని పేర్కొన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన బౌలర్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని మాలిక్ ధీమా వ్యక్తం చేశాడు. తన కొడుకు జాతీయ జట్టులో స్థానం సంపాదించడంపై మాలిక్ తండ్రి మహ్మద్ అబ్దుల్ ఆనందం వ్యక్తం చేశారు. తాను కూడా క్రికెటర్ అని, అయితే జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే తన కల నెరవేరలేదన్నారు. అయితే తన కొడుకు మాలిక్ దాన్ని నెరవేర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మాలిక్‌కు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు దక్కడంతో సుభాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.