బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ చైనా నుంచి టిబెట్‌కు దగ్గరి దారి ఏర్పడేందుకు దీనితో వీలేర్పడింది.
పగుళ్లు తలెత్తిన ఒక్కరోజులోనే ఇది కొంత భాగం వరకూ కూలిపోవడంతో కింద నదిలో టన్నుల కొద్ది కాంక్రీటు పడింది. ఈ ప్రాంతం అంతా గంటల తరబడి దుమ్మూధూళి నెలకొందని వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గాయపడలేదు. ఇక్కడి ఎతైన కొండప్రాంతంలో తలెత్తిన భూగర్భ కుదుపులతోనే బ్రిడ్జి కూలిందని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైందని అధికారులు తెలిపారు.