న్యూఢిల్లీ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) రెండో దశ ప్రక్రియలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అంటే 72.66 శాతం వరకు ఎన్నికల కమిషన్ పంపిణీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 7.66 కోట్ల ఓటర్లు ఉండగా, 6.80 కోట్ల లేదా 88.8 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని బుధవారం ప్రకటించింది.
ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జరగనున్న ఈ ప్రక్రియలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల్లో 2026 లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41కోట్ల వరకు ఉండగా, 5 కోట్లవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఎక్సర్‌సైజును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.