ప్రపంచ ప్రతిభను రప్పిస్తాం …తప్పదు
హెచ్ 1 బి వీసా సమర్థనీయమే
ప్రతిభ కొరతతోనే ఇతర దేశాల నుంచి వలస
ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో ట్రంప్ యూటర్న్
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు తమ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రాకపై ఆంక్షలకు భిన్నంగా ఆయన ఈ యూటర్న్‌కు దిగారు. ఇతర దేశాల ప్రతిభావంతులను అమెరికాకు రప్పించే హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను ట్రంప్ తమ మాటలతో సమర్థించారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు ఇక్కడి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా ఉండరాదు. వచ్చీరాగానే ఇక్కడ మిస్సైల్స్ తయారీకి దిగరాదని వ్యాఖ్యానించారు. స్థానికులకు ప్రాధాన్యత అవసరం అన్నారు. మీరు ఇక్కడికి రావాలని కోరుతున్నానని, ప్రతిభతో నూతన ఆవిష్కరణలతో వచ్చే వారికి అమెరికా స్వాగతం ఉంటుందని తెలిపారు.
ఫాక్స్‌న్యూస్‌కు ఆయన లౌరా ఇన్‌గ్రహంతో ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. తొలిసారిగా ఆయన హెచ్ బి వీసా ప్రోగ్రాంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ అధికార యంత్రాంగానికి హెచ్ బి వీసా ప్రోగ్రాం నెంబర్ ఒన్ ప్రాధాన్యత విధానం కాదని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లకు వేతనాలు పెంచాలనుకునే వారు ఈ దేశంలో వేలాది మంది విదేశీ వర్కర్లను తీసుకువస్తామంటే కుదరదని తెలిపారు. అమెరికాలోనే బోలెడు ప్రతిభ ఉంది కదా? విదేశీ ప్రతిభ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఇంటర్వూకర్త లౌరా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ అదేమీ లేదు. కొన్ని రంగాలకు సంబంధించి ఇక్కడ చాలినంత ట్యాలెంట్ లేదనేది తన అభిప్రాయం అని తేల్చిచెప్పారు. ప్రతిభ విషయంలో కొరత ఉందని, మనం నేర్చుకోవల్సి ఉందని స్పష్టం చేశారు.
కొన్ని రకాల ఉత్పత్తుల తయారీకి మనం నిరుద్యోగపు క్యూల్లోని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేం. మిస్సైల్స్ తయారీ కేంద్రాల్లోకి ఎవరిని బడితే వారిని తీసుకోలేం కదా? అని బదులిచ్చారు. జార్జియా ఉదాహరణను తీసుకుంటే అక్కడ విదేశీయులు తిష్టవేసుకుని ఉన్నారు. దక్షిణ కొరియా వారు అక్రమంగా వలస వచ్చి అయినా తిష్టవేసుకున్నారు. బ్యాటరీల తయారీ అంత తేలికకాదు. ప్రమాదకరం, పలు పేలుళ్లు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.
ఇక్కడి వారు బ్యాటరీల తయారీలో శిక్షణ పొందాల్సిందే. బయటివారిని పంపించచ్చు. ఇది అంతా కోరుకునేదే. అయితే కొన్ని విషయాలలో బయటి ప్రతిభ అవసరం అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం చాలా కాలంగా హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంలపై అడ్డుకట్టకు దిగుతోంది. విదేశీ ఐటి ప్రతిభావంతులను తమ కంపెనీలలో పనిచేయించుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు హెచ్ 1 బి వీసాదార్లను గుర్తించి తగు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతోంది. భారతీయ వృత్తి విద్యానిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు హెచ్ 1 బి వీసాల ద్వారా అమెరికాకు వచ్చి ఉద్యోగాలలో ఉంటున్నారు.