జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే వేలాది కోట్లతో అభివృద్ధి పనులు
ఢిల్లీలోని నా నివాసంలో ఐటి సోదాలపై హరీశ్‌రావు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
జూబ్లీహిల్స్‌లో మంత్రులతో కలిసి ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సుమారు 100 కోట్లతో కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన యూసుఫ్ గూడాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నవీన్ యాదవ్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి ఆచరించే వ్యక్తి అని తెలిపారు. నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రులందరినీ సమన్వయం చేసుకుని వేలకోట్ల నిధులతో మురికి వాడలతో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, సత్తా, సంకల్పం ఉన్న యువ నాయకుడు నవీన్ యాదవ్ అని తెలిపారు. అటువంటి యువకుడిని గెలిపించుకోవడం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి, రేషన్ కార్డులు వంటి పనులు వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున నవీన్ యాదవ్ ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదు
అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాలు వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడతామని భ్రమలు కల్పించిన బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పరిపాలించి ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. అధికారం కోల్పోయి ఇప్పుడు మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగకుండా బిఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు సీనియర్ నాయకుడు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖ కూడా నిర్వహించినా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో తనకు ఇల్లు ఉందో, లేదో అందరికీ తెలుసని, ఐటీ రైడ్స్ అధికారికంగా జరుగుతాయని, అందరికీ తెలిసే జరుగుతాయన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పెద్ద సంఖ్యలో ఉన్న పేద బిడ్డలు ఇంటర్నేషనల్ స్టాండరడ్స్ తో ఉచితంగా చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడి వారి కాళ్లపై వాళ్లు నిలదొక్కుకునేలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం తిరిగి ప్రారంభించిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని 15 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని వివరించారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.
గత టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలను నిర్వహించలేకపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపే విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఎన్ని అడ్డంకులు కల్పించినా నియామక పత్రాలు కూడా అందచేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండేళ్ల కాలంలోనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు కూడా అందించామని చెప్పారు. 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రైవేట్ రంగంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందని భట్టి విక్రమార్క తెలిపారు.