కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ శ్రద్ధ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందని అంటున్నారు.
నేను సినిమా చూసి కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. రాము ‘శివ’తో సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సమ్‌థింగ్ మ్యాజిక్ జరిగింది. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. శివ అందమైన అనుభవాన్నిచ్చింది. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త అనుభవాన్నిచ్చింది”అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా. -నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తను రౌడీ కాదు. కానీ ఒక సందర్భంలో తన చేతిలో ఆయుధం ఉండాలనుకున్నప్పుడు, అది సహజంగా ఉండాలి. అలా సైకిల్ చైన్ ఆలోచన వచ్చింది”అని తెలిపారు.