మాస్ మహరాజ రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్‌కి అది ఒక పండుగలా ఉండేది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీతో ఆయన సినిమాలు నిండిపోయేవి. గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ఎదుట బోల్తా పడింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు రవితేజ.
‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనికి ‘#RT76’ అనే వర్కింగ్ టైటిల్ ఇంతకాలం ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో రామసత్యనారాయణ(రవితేజ) జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లు. సునీత్, సత్య, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో ప్రకటించారు.