సత్యజిత్ రాయ్ తరువాత ‘స’చిత్రకారుడిగా ఓ పుష్కరకాలం పిదప చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన దర్శకుడు బాపు. ఆయన లాగే ఈయన కూడా ఏ ఫిలిం స్కూల్‌లోనూ తర్ఫీదు పొందలేదు. ఈ ఇద్దరూ దర్శకులుగా ఎవరి వద్దా శిష్యరికం చేయకుండానే చలనచిత్ర ఆరంగేట్రం చేసిన ఆరిందలు. సత్యజిత్‌రాయ్ కనీసం శాంతినికేతన్‌లో చిత్రకళను అభ్యసించారు. కానీ మన బాపు మాత్రం పూర్తిగా సెల్ఫ్ మేడ్ విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలతో పాటు కార్టూన్‌లు, క్యారికేచర్లు, తైలవర్ణ చిత్రాలు.. ఇలా ఒకటేమిటి చివరకు ఫొటోగ్రఫీ కూడా, ఆయన వదలలేదు. సినిమాలకి, పబ్లిసిటీ కూడా ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా చేసాడు బాపు. 1967లో సాక్షి చిత్రంతో దర్శకుడిగా మారకముందే ఆయన 16ఎంఎం లో ‘లైఫ్ ఇన్ మద్రాస్’ అనే డాక్యుమెంటరీని తానే ఫొటోగ్రాఫ్ చేసి తీసాడని చాలా మందికి తెలియదు. ‘ఇన్‌ఫాక్ట్ హి వజ్ ఎ కంప్లీట్ విజువల్ ఆర్టిస్ట్’. తాను తెరకెక్కించే ప్రతీ చిత్రానికి స్టోరీబోర్డు తయారు చేసుకోవడం, అలాగే తీయబోయే సీన్స్ తాలూకు షూటింగ్ స్క్రిప్ట్ వివరంగా రాసుకోవడం తన మొదటి సినిమా నుంచీ ఆయనకున్న అలవాటు. అప్పట్లో సత్యజిత్ రాయ్ లాగే ఇండియన్ సినిమాలో ఇటువంటి సాంప్రదాయాలని పాటించిన ఫిల్మ్ డైరెక్టర్ బాపు మాత్రమే అందుకే ఆయన విలక్షణమైన విజువల్ స్టోరీ టెల్లింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేవారు.
‘బాపు’రే బాప్.. క్లోజప్
సినిమా మీడియం శైశవదశలోనే దానికో దృశ్యవ్యాకరణం తయారుచేసిన వారిలో ముఖ్యుడు అమెరికన్ దర్శకుడయిన గ్రిఫిత్. సినిమాలలో క్లోజప్ షాట్స్‌ని ఆయనే ప్రవేశపెట్టాడు. సాధారణంగా క్లోజ్ షాట్స్‌ని పాత్రల భావోద్వేగాలను ఒకరకమైన ఉత్ప్రేక్షతో ఉటంకించడానికి సన్నివేశాల బలాన్ని ఇనుమడింపచేయడానికి వాడు తూ ఉంటారు. అంటే నాటకీయతను పెంపొందింపచేయడానికి ప్రధానం క్లోజప్ షాట్స్‌ను ఎంచుకుంటారు. శైలిపరంగా ఎక్కువగా క్లోజప్స్ లో చిత్రీకరించడాన్ని సినిమా పండితులు హర్షించరు. ఎందుకంటే అవి సన్నివేశాల సహజత్వాన్ని పరిహరిస్తాయనే ప్రబలమైన నమ్మకం. అయితే ఇక్కడే బాపు తన ప్రత్యేకమైన శైలిలో క్లోజప్స్‌ని, మిడ్ క్లోజ్ షాట్స్‌ని ఒక ‘స్టైలైజ్డ్ వే’లో హ్యూమన్ డ్రామాను పండించడానికి వాడతా డు. ఆ రకంగా ‘అసహజమైన’ క్లోజప్స్‌ని ఒక ’సహజాతం’లా పేర్చి, కూర్చి పాటలను, సన్నివేశాలను రక్తికట్టిస్తాడు. అంతేనా.. పూర్తి పాటలను కేవలం క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించినవాడు ఆయన. అలా ఆయన తీసిన చిత్రాల్లోని మూడు పాటల గురించి, వాటి ప్రాధాన్యత గురించి కొంచెం పరిశీలిద్దాము.
ముందుగా ఆ పాటల చిత్రీకరణలో ఉన్న సారూప్యతలను, పోలికలను, వాటి సాధారణ లక్షణాలను చూసి తరవాత వాటి విశేషాల ను క్లుప్తంగానైనా చర్చిద్దాం. మొదటి ది ఆ మూడు చిత్రాల ఏస్పెక్ట్ రేషి యో (అంటే తెర పొడవు వెడల్పుల నిష్పత్తి) 4:3 (లేక 1:1.33). దీనినే ఎకాడమీ రేషియో అని కూడా అంటారు. రెండవది ఆ మూడు చిత్రాలు వర్ణ చిత్రాలే. ఇక మూడవ ది ఈ పాటలన్నీ పూర్తిగా క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో మాత్రమే తీసారు. నాలుగవది ఈ పాటలని చాలా వరకూ లాంగ్ ఫోకల్ లెన్స్ ల తో చిత్రీకరించారు. ఇక అయిదవది అతి ముఖ్యమైనది ఏమిటంటే వీటిలో కేవలం నటీనటుల కదలికలు తప్పితే కెమెరా మూవ్‌మెంట్స్ ఏమీ లేవు, అంటే ‘స్టాటిక్ కెమెరా’ అన్నమాట.
ఆ చిత్రాలు పెళ్లి పుస్తకం (1991), గోరంత దీపం (1978) అందాల రాముడు (1973). ఇప్పుడు ఈ పాటల చిత్రీకరణ గురించి కాస్త వివరాలలోకి వెళదాం. ముందుగా 1991లో తీసిన ‘పెళ్ళి పుస్తకం’ సినిమాలోని టైటిల్ సాం గ్ పిక్చరైజేషన్ దగ్గర నుంచీ మొదలుపెట్టి 1978 గోరంతదీపం మీదుగా 1973లో తీసిన ‘అందాల రాముడు’ సినిమా టైటిల్ సాంగ్ వరకూ ఉన్న విశేషాలను తెలుసుకుందాం. ‘పెళ్ళిపుస్తకం’లో వచ్చే ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట ఆ సినిమాకి టైటిల్ సాంగ్ మాత్ర మే కాక బహుళ ప్రజాదరణ పొందిన పాపులర్ సాంగ్. ఈ పాట సినిమా కొంత మొదలయ్యాక వస్తుంది. కానీ ఇది చిత్రానికి ఆయువుపట్టు వంటిది. వివాహ క్రతువును వర్ణిస్తూ సాగే ఈ పాట ఆరుద్ర రచన. పాటంతా క్లోజప్స్ లోనూ, మరికొన్ని మిడ్ క్లోజ్ షాట్స్‌లోనూ కలిపి పూర్తి చేసారు బాపు, కొన్ని కొన్ని చాలా టైట్ క్లోజప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అంతా ‘ఔ ట్ ఆఫ్ ఫోకస్’లో అంటే ‘సజెషన్’ లోనే ఉంటుంది. క్లోజ్ షాట్స్‌లో లాంగ్ ఫోకల్ లెన్స్‌ల వాడకం వలన నటీనటుల హావభావాలు చాలా ‘షార్ప్ ఫోకస్’లో ఉంటూ వారి భావప్రకటనా శక్తిని ద్విగుణీకరింపచేస్తాయి. ఫిలిం మేకింగ్‌లో ఎకానమీకి, ప్రెసిషన్‌కీ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది ఈ పాట చిత్రీకరణ. పాపులర్ తెలుగు సినిమా చరిత్రలో ఇది ట్రెండ్ సెటర్.
ఇప్పుడు ‘గోరంతదీపం’(1978) చిత్రం సెకండ్ హాఫ్‌లోని ఒక ముఖ్యమైన మలుపు వద్ద వచ్చే ఒక రకమైన ‘లేమెంట్’ వంటి పాట ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..’ గురించి నిజానికి ఈ పాట ఒక విధమైన స్వగతం లాగా సాగుతుంది. ఈ పాట చిత్రీకరణ కూడా చాలావరకూ క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లోనే చేయడం దర్శకుడు బాపు, కెమెరామన్ ఇషాన్ ఆర్యల పనితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏమాత్రం మేకప్ లేని వాణిశ్రీ సహజ సౌందర్యా న్ని ఇషాన్ మినిమల్ లైటింగ్, బాపు బ్లాకింగ్, ఫ్రేమింగ్ చాలా భావస్ఫోరకంగా మూడ్‌కి తగ్గ ట్లు చూపిస్తాయి. ఇకపోతే ఉన్న రెండు, మూడు జూమ్ షాట్స్ కూడా చాలా స్లోగా, కెమెరా పెరస్పెక్టివ్ మారకుండా పాత్రధారి కదలికలతో మమేకమయ్యి లిరికల్ ఫీల్‌ని కలిగిస్తాయి ప్రేక్షకులకు.
చివరగా ‘అందాల రాముడు’ (1973) చిత్రంలోని ‘పలుకే బంగారమాయెరా అందాల రామా’ అనే పాట ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌గా వస్తుంది. సుమారు ఐదు దశాబ్దాలకు ముందే వర్ణచిత్రాలలో పూర్తి గా ఒక పాటని కేవలం క్లోజప్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించిన ఘనత బాపుకే దక్కుతుంది. అప్పటికింకా మన సినిమాలలో సాంగ్ పిక్చరైజేషన్‌కు సంబంధించి ఇటువంటి ప్రయోగాలు ఎవరూ చేసేవారు కాదు. భారతీయ సినిమాలో తొలిసారి ఒక పాటను అందునా ఆంగికాభినయ ముద్రలతో నిండిన కొరియోగ్రాఫ్డ్ మూవ్‌మెంట్స్‌ని ‘స్టాటిక్ కెమెరా’తో ‘ఐ లెవెల్ వ్యూపాయింట్’లో క్లోజ్ షాట్స్‌ని ప్లాన్ చేసి షూట్ చేసిన మొట్టమొదటి సినిమా దర్శకుడు మన బాపు. బాలమురళి గానానికి మామ మహదేవన్ ‘జాజిఫై చేసిన ‘ఇంటర్ లూడ్స్’, తెరపై నర్తకి కనకదుర్గ అభినయం చక్కగా కుదిరాయి. పాట చివర్లో నర్తకి వెనుతిరిగే షాట్‌ని ‘సజెషన్’లో తీసి, అంటే ‘ఔట్ ఫోకస్’లో చూపించడం ద్వారా ఆ నర్తకి ‘రంగ నిష్క్రమణాన్ని’ అద్వితీయంగా దృశ్యమానం గావించాడు దర్శకుడు బాపు. ఈ విధంగా ‘ట్రెడిషనల్ ఫేడ్ ఔట్’ స్వరూప స్వభావాలనే మార్చిన వైనం 1973కి పూర్వం మన సినిమాలలో ఎక్క డా కనపడదు. ఒక దర్శకుడు సినిమా మాధ్యమాన్ని కొత్త దారిలో నడిపించడం అంటే ఏమి టో ఈ పాట చిత్రీకరణ సాధికారంగా తెలియ చేస్తుంది.
– ఎస్.జె.సూర్య