తెలంగాణ అస్తిత్వం- సృజన రంగం 9
ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈసారి సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు, నమస్తే తెలంగాణ పూర్వ ఎడిటర్, తెలంగాణా ప్రెస్ అకాడమి తొలి ఛైర్మెన్ అల్లం నారాయణ,
అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో
తెలంగాణ అస్తిత్వం అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
తెలంగాణ అస్తిత్వం అంటే నా దృష్టిలో ముందు ప్రాంతీయ గుర్తింపు, అంతర్గత వలసలన్నింటిలా తెలంగాణ కూడా కోస్తాంధ్ర వలసాధిపత్యంలో స్వంత అస్తిత్వాన్ని కోల్పోయింది. పరాధీన సంస్కృతి ప్రభావంలో ఆత్మను కోల్పోయింది. ఫలితంగా వలసాధిపత్యం మీద ఆగ్రహం, ప్రతిఘటన, సంక్షోభం ఏర్పడి వివక్షలకు వ్యతిరేకంగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం జరిగింది. సమున్నత చరిత్ర, ప్రత్యేక సంస్కృతి, సాహిత్యం, కళలు, జీవన విధానం, రీతులు ప్రత్యేకంగా రూపుదిద్దుకోవడానికి తెలంగాణ ‘అస్తిత్వమే’ మూలం. వెయ్యేండ్ల సామాజిక చలనాల చరిత్ర, తెలంగాణ అస్తిత్వంలో ఆత్మగౌరవం, ధిక్కారం ప్రధాన లక్షణాలుగా ఏర్పడ్డాయి. వ్యవహార విజయాలకన్నా (wardly success) తెలంగాణ అస్తిత్వంలో బతుకును ప్రేమించేతత్వం ముఖ్యమైనది. సుదీర్ఘకాలం ముస్లింల పరిపాలన, భాషావైవిధ్యాలు, జీవన విధానాల ఆదాన ప్రదానాలు. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ‘గంగా జము నా తెహజీబ్’గా తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకమైనది.
సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్తి త్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలని మీరనుకుంటారు?
సాహిత్యం, సాంస్కృతిక కళారంగాల్లో ఆత్మగౌరవం, ధిక్కరణ స్వభావాల సారాంశంగా ఉం డాల్సిన స్థితి మారింది. ఉద్యమ సందర్భంలో వెల్లడైన ఆకాంక్షలు, సామాజిక, ప్రజాస్వామ్య భావనలుగా ప్రత్యామ్నాయ సామాజిక నిర్మితి జరగలేదు. అప్పటిదాకా ఉద్యమంలో ఉన్న రాజకీయ శక్తులు, ఫక్తు రాజకీయ సమీకరణలతో ఉద్యమానంతరం విస్మృతి జరగలేదు. నిజానికి తెలంగాణ ఉద్యమం సాంస్కృతికోద్యమం నడిపించిన రాజకీయ ఉద్యమం అనిపించేంత స్థాయిలో ప్రతిఫలనాలు కనిపించాయి. కానీ ఆ తర్వాత భంగపాటు. ఉద్యమ ఆకాంక్షల్లో సాం స్కృతిక, కళారంగాల్లో వెల్లడయిన అస్తిత్వ పతాక ఎత్తిపట్టి మరింత ప్రాంతీయ చిహ్నాలు, సమూనాలు, విధానాలు ఏర్పడాలనేది నా కోరిక.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజ న రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూత న మార్పులు జరిగాయి అనుకుంటున్నారు?
సృజనరంగంలో జరిగిన మార్పులు పెద్దగా చెప్పుకోదగ్గవి కావు. అస్తిత్వ పరిరక్షణకు మౌలికంగా పరాధీనమై న మన సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలను లేదా వలసాధిపత్యంలో విస్తృతికి లోనై, గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న వస్తుగత విషయాలను ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆయా రంగాలలో ఆంధ్రుల పెత్తనం ప్రస్పుటంగానే కనబడుతున్నది. దానికితోడు ప్రభుత్వాలకు సంస్కృతికి చుక్కెదురు అన్న మాటలను నిజం చేస్తూ ఈ రంగాలు పట్టించుకోకుండా అనాధలయ్యాయి. పైపై మార్పులే తప్ప ఉద్యమ సందర్భంలో ప్రకటించిన అస్తిత్వ ఆకాంక్షలేవీ పెద్దగా ఫలించలేదు.
మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యా ప్తంగా సృజరంగాల్లో ఎంతో వేగం గా వివిధ సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణ స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్యం, కళారంగాల నుంచి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?
తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకతే ‘సమ్మిళిత సంస్కృ తి’, ‘గంగా జమునా తెహజీబ్’.. నిజమే గ్లోబరీకరణ ప్రాంతీయతలను, ప్రత్యేక అస్తిత్వాల చారిత్ర క, సాంస్కృతిక, సామాజిక విభిన్నతలను ప్రత్యేకతలుగా గుర్తించదు. కానీ ‘స్థానికీయతే విశ్వజనీనత’.. తెలంగాణ లాంటి సాంస్కృతిక అస్తిత్వం భిన్నత ఆదాన ప్రదానాలు ప్రధాన లక్షణంగా పరిపుష్టం అవుతుంది. గ్లోబరీకరణ ప్రపంచాన్ని మన ముందర నిలిపింది. అనేక అస్తిత్వాలను, వాటి సంక్లిష్టతలను పరిచయం చేసింది. వాటిని స్వీకరించడం అనంటే అవి తెలంగాణా కన్న గొప్ప లక్షణాలుగా అయి ఉండాలి.
తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
తెలంగాణ అస్తిత్వంలోని ప్రధాన సంస్కృతీ చిహ్నా లు, నమూనాలను పరిరక్షించుకోవాలి. భాషకు సంబంధించి ఉద్యమ సందర్భంలో చాలా చర్చ జరిగింది. సంస్కృతికి మొదటి కిస్తీ భాష అంటా రు. తెలుగు భాషలో, తెలంగాణ భాషలో గందరగోళం అక్కరలేదు. మాండలికం కాదు, భాషే వాడుకగా పెరగాలి. పాఠ్య పుస్తకాలు, సినిమాలు, పండుగలు, పబ్బాలు అన్నీ ఏవైతే అస్తిత్వ పతాకాలుగా వెలుగొందాయో వాటిని కాపాడుకోవాలి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పరిమళించాలి.