ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరిం చడంతో భక్తులు ఆగ్రహం కనబర్చారు. అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టిటిడి పేర్కొంది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది.
టిటిడి ఫిర్యాదుతో ఎపి ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. టిటిడి నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం, పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టిటిడి స్పష్టం చేసింది. కాగా, అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టిటిడి అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను తీవ్రతరం చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.