న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఈ సంఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. “సాయంత్రం దాదాపు 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారులో పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు పాదచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.
సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ , ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపం లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించాం. ఢిల్లీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జితో మాట్లాడాను. వారు ప్రస్తుతం సంఘటన స్థలంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్రదర్యాప్తు నిర్వహిస్తాం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం” అని అమిత్ షా తెలిపారు.