న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకున్నారు. సాయంత్రం 6.55 గంటలకు పోలీస్ కంట్రోల్ రూంకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎర్రకోట గేట్ నెం.1 వద్ద పేలుడు జరిగినట్లు సమాచారం వచ్చిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, ఇతర దర్యాప్తు బృందాలు ఘటనస్థలిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పేలుడు నేపథ్యంలో ఎర్రకోట సమీపంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.