ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో వేలం పాటను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఐపిఎల్ కోసం ఈ మెగా వేలం పాటను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత రెండు సీజన్‌లలో ఐపిఎల్ వేలం పాటను విదేశాల్లో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్‌లోనే దీన్ని నిర్వహించేందుకు బిసిసిఐ సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఏ నగరంలో వేలంపాట నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 15న ఐపిఎల్ వేలం పాట జరిగే అవకాశాలున్నాయి.
నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చుసుకునే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి ఇవ్వాల్సి ఉంది. కొన్ని రోజుల వరకు ఈసారి కూడా వేలం పాటను గల్ఫ్ దేశాల్లోనే నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. ఆయా ఫ్రాంచైజీలకు బిసిసిస ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కథనాలు కూడా వినవచ్చాయి. కానీ ప్రస్తుతంఅవన్నీ ఊహాగానాలేనని తేలింది. ఈసారి వేలం పాటను భారత్‌లోనే నిర్వహించేందుకు బిసిసిఐ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఆటగాళ్ల రిటైన్ జాబితా వచ్చిన తర్వాతే బిసిసిఐ వేలం పాట గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.