హోరెత్తిన ప్రచారపర్వానికి తెర
ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం
రేపు ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్
58 మంది అభ్యర్థులు.. 407 పోలింగ్ కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేడెక్కించిన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ఇప్పటివరకు మోగిన మైకులు మూగపోయాయి. పార్టీలు, నేతల వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. పార్టీలు, నేతలు చేసిన విన్యాసాలకు ముగింపు పలుకుతూ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరి దృష్టి ఆకర్షిస్తోన్న ఉపఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 11(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 407 కేంద్రాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.
మొత్తం 4,01365 మంది ఓటర్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటా కలిపి ఒక్కో ఇవిఎంలో 59 గుర్తులు ఉంటాయి.ఈ ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,01365 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 85 వేల 61 మంది పురుషులు, లక్ష 92 వేల 779 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 25 మంది, సర్వీసు ఓటర్లు 18, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 123, వికలాంగులు 1,908 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్‌లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు.
ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది.
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 3 లక్షల 85 వేల 265 మంది ఓటర్లు ఉండగా, ఉపఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితా ప్రకారం ఈసారి 2,383 ఓట్లు పెరిగాయి. పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండటంతో ఓటింగ్ శాతం పెంపుకోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే ప్రచారం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి 50 శాతం దాటే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.