ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ఇంకా చాలా సమయమే ఉన్నా.. దాని గురించి చర్చ ఇప్పటికే మొదలైంది. ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని ఆట్టిపెట్టుకుంటాయో, ఎవరిని వదిలేస్తారా అని అభిమానులు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సోమవారం రవీంద్ర జడేజా ఇన్‌స్టా అకౌంట్ మాయమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైందనే వార్తకు మరింత బలం చేకూరింది. కానీ, అసలైన కారణం ఇప్పటి వరకూ తెలియరాలేదు.
వచ్చే ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను వదులుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. సంజూని తమ జట్టులోకి తీసుకొని అతడికి బదులుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదలుకొనేందుకు సిఎస్‌కె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ జట్టు ఆమోదం తెలిపితే ఈ ప్రక్రియ పూర్తవుతుందట.
2021 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో అతడు ఎక్కువ మ్యాచ్‌లు ఆర్ఆర్ తరఫునే ఆడాడు. మరోవైపు సిఎస్‌కె జట్టులో రవీంద్ర జడేజా కూడా చాలాకాలంగా కొనసాగుతున్నాడు. 2022లో అతడికి స్వల్పకాలం కెప్టెన్సీ కూడా ఇచ్చారు. కానీ, కెప్టెన్‌గా జడేజా ఆకట్టుకోకపోవడంతో మరోసారి ఆ బాధ్యతలను ధోనీకే అప్పగించారు. అయితే జడేజా తొలి రెండు ఐపిఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫఉనే ఆడాడు.