కల కని ఎన్నాళ్లు అయ్యింది
పచ్చని పొలం వెంట పల్లె పాట పాడుకున్నట్లు
గట్ల మీద బాల్యం
అమ్మ వెంట నడిచిన గుర్తులు
కల కని ఎన్నాళ్లు అయ్యింది
బస్‌స్టాప్‌లో బాల్య మిత్రుడిని కలుసుకున్నట్లు
కౌమారం ముచ్చట్ల మూట విప్పి మురిసినట్లు
కల కని ఎన్నాళ్లు అయ్యింది
యౌవనం వీధిలో ఆమె మళ్ళీ తారసపడ్డట్టు
యునివర్సిటి వలపు చెట్లకింద
వూసులు వికసించినట్లు
కల కని ఎన్నాళ్లు అయ్యింది
సంసారానికి సిక్ లీవ్ పెట్టినట్లు
హిమాలయం చెంత
చింత లేకుండా సేద తీరినట్లు
కల కని ఎన్నాళ్లు అయ్యింది
నాన్న భుజంపై వాలి
గుండె అలుగు దుమికినట్లు
మనిషి జన్మ వరమా, శాపమా అని అడిగినట్లు
కల కని ఎన్నాళ్లు అయ్యింది
కలల కునుకు కోసం తపస్సు తప్పనట్లు వుంది
కళ్లకు ఎన్నిమార్లు అర్జీ పెట్టుకున్నా
కలలు కనికరించవు కదా
– దాసరి మోహన్