అవమానకరంగా బిఆర్‌ఎస్ నుంచి బయటకు పంపారు
ప్రొటోకాల్ పేరుతో గత ప్రభుత్వం నన్ను కట్టడి చేసింది
ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ/హన్మకొండ: ఆడబిడ్డ రాజకీయాలు చేయొద్దని గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం తనను కట్టడి చేసిందని, అవమానకరంగా తనను పార్టీ నుంచి బయటకు పంపారని, ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్‌లో తనను ప్రొటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే కట్టడి చేశారన్నారు. టీచర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండేనని అన్నారు. 20 ఏళ్లు బిఆర్‌ఎస్‌లో పనిచేస్తే తనను అవమానకరంగా బయటకు పంపించారని వ్యాఖ్యానించారు. కనీసం తనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. నేను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటానని, అవమానాన్ని మాత్రం తట్టుకోలేనని అన్నారు. పొలిటికల్‌గా బిఆర్‌ఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చునని అన్నారు. తనను బిఆర్‌ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇకపై పక్కా రాజకీయాలు చేసి చూపిస్తానని చెప్పారు. ఆడబిడ్డ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. రా ష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ రెండూ ప్రజలకు మంచి చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. వరంగల్ గడ్డ పౌరుషాల గడ్డ అని, ఇక్కడ నడయాడిన కవులు, మేధావులు సమ్మక్క సారల పౌరుషాన్ని నింపుకున్న నేల అన్నారు. అయినా తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌లో అభివృద్ధిలో లేదన్నా రు. ప్రస్తుత పాలకులు ఇక్కడి అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయారని గుర్తు చేయాడానికే వరంగల్ గడ్డను ఎంచుకొని పర్యటన చేస్తున్నానని అన్నారు. యాక్షన్ రిపోర్ట్ తయారుచేసి దాని ప్రకారంగా సమస్యలపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానని అన్నారు.