అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి స్టేషలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 715 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని దశలవారీగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి రోజు దాదాపు 1.97 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తుంటారని తెలిపారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటీన్ వంటి సదుపాలు కల్పిస్తామన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నామని ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నామని బస్ స్టేషన్‌కు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26 లిప్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్‌స్టేషన్‌లు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు స్టేషన్‌లో ఉంటాయన్నారు. రోజుకు 5 లక్షల మురుగునీటి శుద్ద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్టేషన్ పూర్తయితే ప్రతి రోజు 2.70 లక్షల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతున్నదని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ స్టేషన్‌ను ప్రారంభించాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, అలాగే చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి కావాల్సిన మద్దతు అందుతుందన్నారు. ఇప్పకిటే 50 శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో సౌత్‌బ్లాక్ బేస్‌మెంట్, మల్లీలెవెల్ కారు పార్కింగ్, కాజీపేట వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్‌ఫారం, హైదరాబాద్ వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.