మన తెలంగాణ/హైదరాబాద్‌ః “2034 వరకూ అధికారం మాదే..రాసిపెట్టుకోండి.. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్‌ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు.
గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.