చిత్రపురి సమస్య పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యునిగా మాటిస్తున్నా
మీకు ఏమి కావాలో చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా
సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
సినీ, టెలివిజన్ రంగం ప్రతినిధుల కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో టెలివిజన్ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిత్రపురి సమస్యను కూడా తప్పక పరిష్కరిస్తామని, చిన్న నటులకు కూడా అందులో అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటీనటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మీరు ఓటు రూపంలో మాకు అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, సినీ కార్మికులు, టెలివిజన్ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.